
రైలులో తోటి ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఒక ఉన్మాదిని వారించడానికి ప్రయత్నించిన హోంగార్డు అతడి ఉన్మాదానికి బలైపోయాడు. నడుస్తున్న రైలు నుండి తోసేయడంతో హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ఘాతుకం చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి… అలెప్పీ నుండి ధన్‌బాద్ వెళుతున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యక్తి తోటి ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తించసాగాడు. ఎవరికీ అర్థంకాని భాషలో అతడి ఉన్మాద చేష్టలతో ప్రయాణీకులంతా విసుగెత్తిపోయారు. కాగా తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రెడ్డి సూర్య వెంకట శివ (36) తుని వెళ్లే నిమిత్తం సామర్లకోటలో బొకారో ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ఈసందర్భంగా బోగీలో ప్రయాణీకులతో అనుచితంగా
ప్రవర్తిస్తున్న వ్యక్తిని శివ వారించే ప్రయత్నంచేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో సదరు వ్యక్తి శివను నడుస్తున్న రైలు నుండి తోసేశాడు. రైలు నుండి కిందకు పడిపోయిన శివ అక్కడికక్కడే మృతిచెందాడు. తుని రైల్వే స్టేషనుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది నిముషాలకే రైలు తుని స్టేషనుకు చేరుకోవడంతో ప్రయాణీకులిచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగాలీలో మాట్లాడుతుండటంతో అతడి వివరాలు సేకరించే ప్రయత్నంలో పోలీసులున్నారు. కాగా నిందితుడి పేరు హబీబ్ అని అతడు ఉన్మాది అని భావిస్తున్నారు. అయితే అతడు బంగ్లాదేశ్‌కు చెందిన వాడు అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరుూం అస్మీ, తుని రూరల్ సీఐ కిషోర్‌బాబు, కోటనందూరు ఎస్సై అశోక్‌బాబు, హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోంగార్డు మరణం పట్ల విచారం వ్యక్తంచేశారు. తుని రైల్వే పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





