News

భారత్‌పై అక్కసు వెళ్ళగక్కబోయి అడుసులో కాలేసిన ఇమ్రాన్ ఖాన్

637views

భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాలనే ధోరణితో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తప్పులో కాలేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ ఫేక్‌ వీడియో పోస్టు చేసి విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. అసలేం జరిగిందంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లింలపై భారత పోలీసుల దాడిగా అభివర్ణిస్తూ పాక్‌ ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో పోలీసులు ‘ఆర్‌.ఎ.బి.’ అని ఉన్న షీల్డులను ధరించి ఉండటం చూడొచ్చు. ఆర్‌ఏబీ అంటే బంగ్లాదేశ్‌కు చెందిన రాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌. అది ఆ దేశంలో నేరాలను, తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఏర్పడిన పోలీసు విభాగం. పైగా ఆ వీడియో ఇప్పడిది కాదు.. బంగ్లాదేశ్‌లో 2013లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించినది. ఆ వీడియోకు భారత్‌కు అసలు ఎలాంటి సంబంధమూ లేదు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ చర్యను ఖండిస్తూ విమర్శలు వెల్లువెత్తాయి.

భారత విదేశీ వ్యవహారాల శాఖ మీడియా ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ఇమ్రాన్‌పై మండిపడ్డారు. ”అసత్య వార్తలను ట్వీట్‌ చేయండి… దొరికిపోండి…ట్వీట్‌ను డిలీట్‌ చేయండి…రిపీట్‌ చేయండి…” అంటూ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో విమర్శించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ కూడా ”మళ్లీ మళ్లీ తప్పులు చేసే అపరాధి…పాత అలవాట్లు మానుకోవటం కష్టం…” అంటూ ట్విటర్‌లో ఎద్దేవా చేశారు. పొరపాటును గుర్తించి నాలుక కరుచుకున్న పాక్‌ ప్రధాని.. తన ట్విటర్‌ ఖాతా నుంచి ఆ పోస్టును తొలగించడం గమనార్హం.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.