ArticlesNews

అయ్యప్ప మీద మార్క్సిస్టుల దొంగ భక్తి

236views

ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నట్టు, ప్రపంచ అయ్యప్ప భక్తులారా వంప రండి అంటున్నారు కేరళ మార్క్సిస్టులు. సెప్టెంబర్ 20న పంపలో కేరళ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశం ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు దీని మీదే అందరికి అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శబరిమలైలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు కేరళ కామ్రేడ్ల ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. ఇందులో మరొక మలుపు ఉంది.

శబరిమలై దేవస్థానం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేరళ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నాస్తికుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభిస్తాడు. అయ్యప్ప భక్తుల అంతర్జాతీయ సమావేశానికి వచ్చి మరింత పవిత్రం చేయండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలినూ, ఆయన పుత్రరత్నం ఉదయనిధి స్టాలిన్ కు కేరళ దేవదాయ మంత్రి స్వయంగా వెళ్లి ఆహ్వానించి వచ్చారు. ఇందులో స్టాలిన్ అన్నవాడు తమిళనాడులో దేవాలయాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నవాడు. ఆయన కుమారుడు, మంత్రి ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూతోటి, కరోనాతోటి పోల్చినవాడు. కాబట్టి ఈ అంతర్జాతీయ అయ్యప్ప భక్తుల సమావేశం మీద అనుమానం కలగడంలో వింతేముంది? ఇదంతా చూసి స్టాలిన్ లాంటివాడికే సిగ్గేసిందేమో! తాను భక్తుల సమావేశానికి రావడం లేదని ప్రకటించారు. అందుకే దేశం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులంతా అక్కడికి వచ్చి సంప్రదాయ విరుద్ధంగా ఏమైనా జరిగితే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు.

కేరళ ప్రభుత్వం ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించవలసిన అవసరం ఏమిటన్నది మొదటి ప్రశ్న. భారతీయత అన్నా. హిందూధర్మం అన్నా చులకన భావం కలిగిన మార్క్సిస్టుల ప్రభుత్వం 2019లో యువ మహిళా సామాజిక ఉద్యమ కారిణిల కేసు విషయంలో కేరళ ప్రభుత్వం ఏం చేసిందో దేశం మరచిపోలేదని విశ్వహిందూ పరిషత్, శబరిమలై కర్మ సమితి, కేరళ క్షేత్ర సంరక్షణ సమితి హెచ్చరించాయి. అయ్యప్ప ఆలయం గురించి, ఆ ఆలయంలో శతాబ్దాలుగా పాటిస్తున్న ఆచారాల గురించి ఎలాంటి అవగాహన లేని కొంతమంది మహిళా ఉద్యమకారిణుల వ్యాజ్యం మేరకు న్యాయవ్యవస్థ వారిని ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. కానీ అన్ని వయసుల వారిని ఆ ఆలయంలోకి అనుమతించరు. అయినా ఒక మతానికి సంబంధించిన సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం సెక్యులర్ వ్యవస్థకు భంగమన్న సంగతి ఇప్పుడు మార్క్సిస్టులకు ఎందుకు గుర్తుకు రావడం లేదని విశ్వహిందూ పరిషత్ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు విజి థంపి ప్రశ్నించారు. ఇందులోని చట్టపరమైన అభ్యంతరాల గురించి కూడా తాము పరిశీలిస్తామని అన్నారు.

దేవస్థానం యాభయ్ ఏళ్ల వార్షికోత్సవం జరపదలిస్తే తిరువనంతపురంలో జరపాలి గాని, పంచలో ఎందుకని కూడా అంటున్నారు. ఆనాడు మహిళా ఉద్యమకారిణిలు ఒక పథకం ప్రకారం ఆలయంలోకి ప్రవేశించి పవిత్రకు భంగం చేయాలని ప్రయత్నించినట్టే, ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం కూడా చేయబోతున్నదనే అనుమానాలు ఉన్నాయని వి హెచ్ పి ఆరోపణ. 2019లో ఆలయంలోకి ప్రవేశించిన బిందు అమ్మణి అనే ఆమె కూడా ఇప్పుడు భక్తుల సమావేశానికి హాజరవుతున్నది కాబట్టి ఈ అనుమానం తలెత్తిందని భక్తులు అంటున్నారు. పైగా పంప సమావేశానికి రాబోతున్న భక్తులలో 3000 మందికి ప్రత్యేక దర్శనం కల్పిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఇదే అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్నది. శబరిమలై దేవస్థానాన్ని పతనం చేయడమే ధ్యేయంగా 2018 నుంచి కేరళ ప్రభుత్వం పని చేస్తున్నదని శబరిమలై కర్మ సమితి కన్వీనర్ ఎస్ ఆర్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు అంతర్జాతీయ అయ్యప్ప సంగమం దానికి కొనసాగింపేనని అన్నారు. పైగా బెదిరింపులతో ఈ సమావేశాన్ని ఎవరూ ఆపలేరని సాక్షాత్తు ముఖ్యమంత్రి పినరయి విజయన్ బెదిరించడం మరొక విశేషం.