
( సెప్టెంబర్ 14 – గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జయంతి )
ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరుపొందిన గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా ,తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు. ఆంగ్ల పదం ‘ఎడిటర్’ కు ‘సంపాదకుడు’ అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన ప్రజ్ఞాశాలి. 1883 సెప్టెంబర్ 14 న కర్నూలులో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించారు. వారి పూర్వీకులు వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురంగ్రామానికి చెందినవారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక, ఉన్నత విద్య చదివాడు. ఇంకా చదువుకునే ఆర్థికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906లో మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసారు. తరువాత రాజమండ్రిలోఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించారు.
రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందేమాతరంబ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టారు. ‘స్వరాజ్య’ అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవారు. 1908లో తిరునెల్వేలిలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు ‘క్రూరమైన విదేశీ పులి’ అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు. వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.
1914లో బాల గంగాధర తిలక్ యొక్క హోం రూల్ లీగ్ కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసారు. 1924లో కాకినాడలో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించారు. 1927లో కాంగ్రెసు అభ్యర్థిగానంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయసెనేట్ సభ్యునిగా కూడా పనిచేసారు. 1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించాడు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది. తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయనకు వచ్చేవి. ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించారు. ప్రముఖ దినపత్రిక ‘ఆంధ్ర పత్రిక’కు ఆయన తొలి సంపాదకుడు. ది నేషనలిస్ట్, మాతృసేవ, ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు. మహిళల సమస్యలు పరిష్కరం కోసం ‘ సౌందర్యవల్లి ‘ అనే పత్రిక నడిపారు. జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాసారు. ‘స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం’ అనే పుస్తకం రాసారు. ఆయన రాసిన ‘శ్రీరామ చరిత్ర’ అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది. ‘యంగ్ ఇండియా’ పత్రికలో గాంధీజీచే “ది బ్రేవ్ హరిసర్వోత్తమరావ్”అని ప్రశంసలందుకొన్న ఈ’ఆంధ్ర తిలక్’ 1960ఫిబ్రవరి 29న కీర్తిశేషులయ్యారు.





