
వామపక్ష – ఇస్లామిక్ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ సాక్షాత్తు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేరళ గవర్నర్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అందరూ హతాశులయ్యారు. భారతదేశ చరిత్రను వక్రీకరించి మధ్యయుగ ముస్లిం పాలకులు, మత ఛాందసవాదులు అయిన ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ వంటి వారి పాలనలో జరిగిన అకృత్యాలను, యదార్థ చరిత్రను రూపుమాపే ప్రయత్నం చేసిన చరిత్రకారులలో ఇర్ఫాన్ హబీబ్ కూడా ఒకరు.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో గౌరవనీయ గవర్నర్ ప్రసంగిస్తూ “దేశ విభజన సమయంలో పాకిస్థాన్ లో నిలిచిపోయిన ఇస్లామేతరుల రక్షణ బాధ్యతను భారత్ స్వీకరిస్తుందని గాంధీ, నెహ్రూలు చేసిన వాగ్దానాన్ని పౌరసత్వ సవరణ చట్టం (CAA) నేడు నెరవేరుస్తూ ఉన్నది” అని పేర్కొన్నారు.
గవర్నర్ మాటలతో తీవ్రంగా విభేదించిన ప్రొఫెసర్ హబీబ్ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి వేదికపైకి దూసుకు పోయారు. అడ్డుకున్న భద్రత సిబ్బందిని కూడా ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. చరిత్ర విషయంలో తాము చెప్పిందే వేదం. దాన్ని అందరూ అంగీకరించి తీరాలి అన్న పట్టుదల, అహంకారం ఈ ప్రొఫెసర్ లో కనిపిస్తోంది.
అనునిత్యం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే వామపక్ష వాదులు తమకు తప్ప ఇతరులు ఎవరికీ ఆ హక్కు ఉంటుంది అనుకోరు. ఇతరులు కూడా తమ వాదాన్ని వినిపిస్తూ ఉన్నంతకాలం వారికి ఏ అభ్యంతరం ఉండదు. భిన్నమైన వాదాన్ని వినిపించిన మరుక్షణమే అవతలి వారి పై మాటల దాడిని మొదలు పెట్టడమే కాక భౌతిక దాడులకు కూడా వారు తెగబడటం సహజంగా జరిగేదే. ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలలో రుజువైన అంశమిది.
మరి వామపక్షీయుల పాలనలో ఉన్న కేరళలో ఇర్ఫాన్ హబీబ్ వంటి వారికి ఇక అడ్డు ఏముంటుంది? ఒక్క గవర్నర్ విషయంలోనే కాదు సాక్షాత్తూ రాష్ట్రపతి విషయంలోనైనా వారు ఇలాగే ప్రవర్తిస్తారనటంలో సందేహం లేదు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





