News

ఐఏఎఫ్ అధికారి భార్య బలవంతపు మతమార్పిడి కేసులో మరో నిందితుడి అరెస్టు

6views

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఇటీవల వెలుగు చూసిన బలవంతపు మతమార్పిడి కేసులో పోలీసులు తాజాగా మరో నిందితుడిని అరెస్టు చేశారు. హజ్రత్ మౌలానా అనే 24 ఏళ్ల యువకుడిని మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తనను బలవంతంగా మతం మార్చారంటూ ఒక ఐఏఎఫ్ అధికారి భార్య ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతో పాటు గతంలో కలిసి చదువుకున్న అయాజ్, అతడి స్నేహితులు ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. లైంగిక దాడి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అయాజ్ మదారే (26), అతడి స్నేహితుడు అమీన్ షేఖ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. బలవంతపు మతమార్పిడి, వివాహం కేసులో హజ్రత్ మౌలానా పాత్ర కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఎఫ్‌ఐఆర్‌లోని అంశాల ప్రకారం, ఒక హోటల్‌లో అయాజ్ ఈ దారుణానికి పాల్పడ్డట్టు మహిళ ఆరోపించారు. తన డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడని చెప్పారు. తాను స్పృహలోకి వచ్చేసరికి నిందితుడు అసభ్యకరమైన వీడియోలు రికార్డు చేశాడని చెప్పారు. వాటిని తన భర్తకు, ఇతరులకు పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు రూ.4 లక్షల డబ్బు వసూలు చేశాడని కూడా చెప్పారు. ఆ తరువాత మరో సందర్భంలో హజ్రత్, ఇతరులు తనను ఒక చోటకు తీసుకెళ్లి బలవంతంగా అయాజ్‌తో పెళ్లి చేశారని కూడా ఆరోపించారు.