
సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశమని, దేశ సంస్కృతిని చాటి చెప్పే నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించడం అభినందనీయమని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన నవోదయ విద్యాలయం రీజనల్ స్థాయి కళా ఉత్సవ్ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు ఎస్పీకి స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన సభలో ఎస్పీ మాట్లాడుతూ…విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను కళా ఉత్సవాలు వెలికి తీస్తాయని చెప్పారు. చదువుతో పాటు కళల్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కళలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. సమాజంలో మనుషుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు. భరత నాట్యం, కూచిపూడి వంటి నృత్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒంగోలుకు తరలిరావడం సంతోషం కలిగిస్తుందన్నారు. కళా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అబినందించారు. రెండో రోజు కళా ఉత్సవాలు ఉల్లాసభరిత వాతావరణంలో జరిగాయి. పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటుగా అండమాన్ నికోబార్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి 165 మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఎస్బీ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, తాలుకా సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగరాజు, నవోదయ ప్రిన్పిపాల్ సి.శివరామ్ , వివిధ జిల్లాలకు చెందిన నవోదయ ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, విద్యార్థుల తలిదండ్రులు పాల్గొన్నారు.





