
121views
పర్యావరణహిత మట్టి గణపతి ప్రతిమల తయారీలో ఎన్టీఆర్ జిల్లా రికార్డు సాధించిందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(డబ్ల్యూబీఆర్-లండన్) దక్షిణ భారత సంయుక్త కార్యదర్శి డాక్టర్ యు.ఇలియాజర్ ప్రకటించారు. మంగళవారం విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రలో 4,464 ఏకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలతో గతంలో రికార్డు నమోదు కాగా.. తాజాగా విజయవాడలో 7,730 ప్రతిమల తయారీతో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ రికార్డు సాధించినందుకు కలెక్టర్ జి.లక్ష్మీశకు ధ్రువపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో 20 పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు సుమారు 20 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.





