News

సైబర్‌ నేరగాళ్ల పనిపట్టే ‘చిత్రగుప్త’

Business Corporate Protection Safety Security Concept
181views

సైబర్‌ భద్రత, రక్షణ రంగానికి పనికొచ్చే పరికరాల స్టార్టప్‌ ఎగ్జిబిషన్‌ను కాన్పుర్‌ ఐఐటీ ఢిల్లీలో నిర్వహించింది. ఇందులో ‘చిత్రగుప్త’ సాధనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రుషిత్‌ సోని అనే పూర్వ విద్యార్థి ఐఐటీ కాన్పుర్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సహాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 90 శాతం సైబర్‌ నేరాలలో మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారని రుషిత్‌ సోని చెప్పారు. తాను అభివృద్ధి చేసిన పరికరంతో మొబైల్‌ డేటాను అక్కడికక్కడే గుర్తించొచ్చని పేర్కొన్నారు. ‘‘దీన్ని అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. ఈ పరికరం ధర రూ.15 లక్షలు. ఏదైనా సైబర్‌ నేరం జరిగినప్పుడల్లా, నిందితుడి మొబైల్‌ను డేటా కేబుల్‌ ద్వారా పరికరానికి అనుసంధానించి డేటాను విశ్లేషించొచ్చు. అప్పుడు అతని డేటా అంతా పరికరంలోకి వస్తుంది. నేరాల కోసం చేసిన చాటింగ్, లొకేషన్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌ డేటా బయటపడతాయి’’ అని రుషిత్‌ సోనీ చెప్పారు. ఈ ప్రదర్శనలో సైబర్‌ దాడుల ప్రభావాన్ని తగ్గించే కొన్ని పరికరాలూ ఉన్నాయి. రక్షణ రంగానికి ఉపయోగకరంగా ఉండే అనేక డ్రోన్‌లను కూడా ప్రదర్శించారు.