
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ సమావేశం రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో జరగనున్నాయి. సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమన్వయ సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. గత సమన్వయ సమావేశాలు కేరళలోని పాలక్కాడ్ కేంద్రంగా జరిగిన విషయం తెలిసిందే.
ఈ సమన్వయ సమావేశాలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను స్ఫూర్తిగా తీసుకొని, సమాజంలో పనిచేస్తున్న వివిధ సంస్థల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరవుతున్నారు. అన్ని సంస్థల ప్రతినిధులు వారి వారి క్షేత్రాలకు సంబంధించిన అనుభవాలు, ప్రస్తుత పరిస్థితిని ఈ సమావేశం ముందు వుంచుతారు. అలాగే సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని, తమ తమ కార్య క్షేత్రాల్లో యోజన చేసిన అంశాలను కూడా సభ ముందు వుంచుతారు. అలాగే ఈ సమావేశాల్లో జాతీయ ఐక్యత, భద్రత, సామాజిక అంశాలతో పాటు దేశంలోని పరిస్థితులపై లోతైన చర్చ జరుగుతుంది. ఇటీవల దేశంలో చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలపై లోతైన విశ్లేషణ కూడా చేస్తారు.
ఈ సమావేశాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఆరుగురు సహ సర్ కార్యవాహలు, ఇతర అఖిల భారతీయ ప్రముఖులు కూడా హాజరవుతారు. రాష్ట్ర సేవికా సమితి, వనవాసీ కల్యాణాశ్రమం, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ, బీజేపీ, భారతీయ కిసాన్ సంఘ్, విద్యా భారతి, బీఎంస్ తో పాటు మరో 32 సంఘ ప్రేరేపిత సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొంటాయి. ఈ సంస్థల నుంచి జాతీయ అధ్యక్షులు, సంఘటనా మంత్రులతో పాటు ఆఫీస్ బేరర్స్ హాజరవుతారు.





