
ఆపరేషన్ సిందూర్ తర్వాత పోయిన పరువును కాపాడుకొనేందుకు పాక్ నేతలు, జనరల్స్ నోటికొచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ గతంలో కూడా ‘డంప్ ట్రక్కు’ వ్యాఖ్యలు చేశారట. నాడు సౌదీ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలను తాజాగా ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ వెల్లడించారు. మునీర్ మాటలు విని.. అతిథి బృందం మౌనంగా ఉండిపోయిందంట.
సౌదీకి చెందిన ఓ ప్రతినిధుల బృందం మే నెల మధ్యలో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా వారు భారత్‌తో ఘర్షణ విషయంలో ఇస్లామాబాద్‌కు సలహా ఇవ్వబోయారు. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కలుగ జేసుకొని ‘‘భారత్ ఓ మెరుస్తున్న మెర్సిడెస్ బెంజ్ లాంటిది.. కానీ, మనం రాళ్లతో నిండిన డంప్ టక్కు లాంటి వాళ్లం. రెండు ఢీకొంటే ఏమవుతుందో వూహించుకోండి’’ అని వ్యాఖానించారట. దీంతో సౌదీ ప్రతినిధుల బృందం మౌనంగా ఉండిపోయిందిట. ఈ విషయాన్ని లాహోర్‌లో జరిగిన ఓ సెమినార్‌లో మాట్లాడుతూ పాక్‌మంత్రి నఖ్వీ వెల్లడించారు.
ఇదే మంత్రి ఆపరేషన్ సిందూర్ సమయంలో ఒక్క భారత క్షిపణి కూడా తమ దేశ భూభాగాన్ని తాకలేదని అబద్ధాలు చెప్పారు. ఇటీవల అమెరికాలోని టంపాలో జరిగిన ఓ ప్రైవేటు విందులో కూడా మునీర్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. సొంత దేశాన్ని డంప్ ట్రక్కుతో పోల్చుకోవడంతో సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు నవ్వుపాలయ్యాయి.





