News

కాంగ్రెస్, జిన్నా, మౌంట్‌బాటన్‌ల వల్లే దేశ విభజన : ఎన్‌సీఈఆర్‌టీ

191views

భారతదేశ విభజనకు జిన్నా, కాంగ్రెస్‌ పార్టీ, ఆనాటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌లే కారణమని ఎన్‌సీఈఆర్‌టీ విడుదలచేసిన కొత్త మాడ్యూల్‌ పేర్కొంది. దేశ విభజన తరవాతే కశ్మీర్‌ సమస్య పుట్టుకొచ్చిందని ఉద్ఘాటించింది. ఎన్‌సీఈఆర్‌టీ.. 6 నుంచి 8 తరగతుల (మిడిల్‌ స్టేజ్‌) వరకు ఒక మాడ్యూల్, 9-12 తరగతులకు(సెకండరీ దశ) రెండో మాడ్యూల్‌ను విడుదలచేసింది. దేశ విభజన కాలంలో లక్షలమంది నిర్వాసితులయ్యారని, ఎందరో ప్రాణాలు కోల్పోయారని, వారి సంస్మరణార్థం ఆగస్టు 14వ తేదీని దేశ విభజన కాలంనాటి భయానక స్మృతుల సంస్మరణ దినంగా పాటిస్తామని ప్రధాని మోదీ 2021లో ట్విటర్‌ (ఎక్స్‌)లో చేసిన పోస్ట్‌ను ఈ సంస్థ ఉటంకించింది. దేశ విభజన తప్పుడు భావనల వల్లే అది సంభవించిందని మిడిల్‌ స్టేజ్‌ తరగతుల మాడ్యూల్‌ వివరించింది. హిందువులు, ముస్లింలు ఒకరికొకరు ఏమాత్రం పొంతనలేనివారని వాదిస్తూ జిన్నా దేశ విభజనను డిమాండ్‌ చేయగా, కాంగ్రెస్‌ దాన్ని ఆమోదించిందని, విభజన నిర్ణయాన్ని మౌంట్‌బాటన్‌ అమలు చేశారని పేర్కొంది.‘‘భారతదేశానికి 1948 జూన్‌లో స్వాతంత్య్రం ఇవ్వాల్సి ఉండగా, ఆ తేదీని ముందుకు జరిపి 1947 ఆగస్టులోకి తీసుకురావడం మౌంట్‌బాటన్‌ చేసిన పొరపాటు. దీంతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుల నిర్ణయాన్ని సర్‌ సైరిల్‌ రాడ్‌క్లిఫ్‌ కేవలం 5 వారాల్లో పూర్తిచేయాల్సి వచ్చింది. దేశం రణరంగమైంది కాబట్టి విడిపోతేనే మేలని వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పేర్కొన్నారు. దేశ విభజనను తాను ఆమోదించకపోయినా కాంగ్రెస్‌ సమ్మతిస్తే అడ్డుకోబోనని మహాత్మాగాంధీ వ్యాఖ్యానించారు’’ అని ఎన్‌సీఈఆర్‌టీ మాడ్యూల్‌ పేర్కొంది.