News

పొరుగు దేశాల్లో హిందువులపై జరుగుతున్న హింసకాండపై భారత్ ఆందోళన

170views

పొరుగు దేశాల్లో మైనారిటీపై జరుగుతున్న హింసపై భారత్ మరో సారి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. 2021 నుంచి పాకిస్తాన్ లో మైనారిటీలపై కనీసం 334 పెద్ద హింసాకాండలు జరిగాయని, అలాగే బంగ్లాదేశ్ లో 3,582 హింసాత్మక సంఘటనలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ఈ విషయాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పార్లమెంట్ కు తెలిపారు.

రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. పాక్, బంగ్లా, ఆఫ్గనిస్తాన్ లో మతపరంగా మైనారిటీలపై హింస, దౌర్జన్యాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూనే వుందన్నారు. 2021 నుంచి పాక్ లో జరిగిన ప్రధానమైన 334 హింసాత్మక సంఘటనలను భారత్ దాయాది పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం అక్కడి మైనారిటీల హక్కులను రక్షించాలని, మతపరమైన హింసను, అసహనాన్ని అంతం చేయాలని కూడా తాము కోరినట్లు పేర్కొన్నారు.

ఇక.. బంగ్లాదేశ్ లో 3,582 ప్రధానమైన హింసాత్మక సంఘటనలు జరిగాయని తెలపారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తూ, తీవ్రమైన ఆందోళనను కూడా వ్యక్తం చేశామన్నారు. హిందువులు, మైనారిటీల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని తాము కోరామన్నారు.జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్తాన్‌లో మైనారిటీల పరిస్థితులు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలను కూడా ప్రస్తావించామన్నారు.