
‘‘భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ.. తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ’’ అన్నారొక సినీ కవి. మహాత్మాగాంధీ అంటే జాతిపితగానే అందరికీ తెలుసు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో 350 ఇళ్లున్న కేదారిపురం గ్రామస్థులు మాత్రం ఆయనను దైవంగా కొలుస్తుంటారు. ‘గాంధమ్మ’ పేరుతో దేవతలా పూజిస్తారు. ఏటా గాంధమ్మకు పూజలు చేసిన తర్వాతే దమ్ములు ప్రారంభిస్తారు. స్వాతంత్య్ర కాలం నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఖరీఫ్ పనులు ప్రారంభించడానికి సన్నాహకంగా గాంధమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత గాంధీ విగ్రహం ఎదురుగా ఆయన చిత్రపటం పెట్టి పూలు, పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు చేశారు. నానబెట్టిన పెసరపప్పులో కొబ్బరి కోరు, పంచదార వేసి ప్రసాదాలు తయారు చేశారు. ఎర్రమ్మ, భూలోకమ్మ తదితర ఆలయాలకు మేళతాళాలతో వెళ్లి పూజించారు. ప్రతి ఇంటి నుంచి నైవేద్యం, ముర్రాటలు సమర్పించారు. పంటలు బాగా పండేలా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ అంటే మాకు చాలా అభిమానం. ఆయనలో తెలియని శక్తి ఉంది’ అని సర్పంచి ధనుంజయ తెలిపారు. ‘పొలం పనులు ప్రారంభించే ముందు గాంధమ్మను కొలిస్తే పంటలు బాగా పండుతాయని మా నమ్మకం’ అన్నారు.





