News

ధర్మస్థలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న యూట్యూబర్లను తరిమిన భక్తులు

340views

ధర్మస్థల దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని భక్తులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.ధర్మస్థలంలో దాదాపు 30 మంది స్వయంప్రకటిత యూట్యూబర్లతో భక్తులు తీవ్ర ఘర్షణకు దిగుతున్నారు.నిజానిజాలను తెలుసుకోకుండానే ధర్మస్థల దేవాలయం విషయంలో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నారని భక్తులు వార్ని నిలదీశారు. అంతేకాకుండా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా, ఆ తప్పుడు యూట్యూబర్లు బిచ్చగాళ్లంటూ ప్రతీకాత్మకంగా భిక్షాటన చేసి, వారందర్నీ ఆలయ ప్రాంగణం నుంచి తరిమికొట్టారు.

అయితే ఉజిరే ఆసుపత్రిలో జరిగిన సంఘటనలను కవర్ చేయడానికి వెళ్ళిన సువర్ణ న్యూస్ రిపోర్టర్‌పై, ధర్మస్థల అధికారులను విమర్శిస్తూ జరుగుతున్న ప్రచారాలలో పేరుగాంచిన మహేష్ శెట్టి తిమరోడి ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తులు దాడి చేయడంతో పరిస్థితి తీవ్ర మలుపు తిరిగింది.
ఇక.. భక్తులు కేవలం దేవాలయం ముందు నిరసన వ్యక్తం చేయడానికే పరిమితం కాలేదు. ఏకంగా ధర్మస్థల పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. ఆలయాన్ని, ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్గడే ప్రతిష్ఠను స్వయంప్రకటిత యూట్యూబర్స్ దిగజారుస్తున్నారని, వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్రగానే వుండిపోతున్నారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, ఆ సిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినా.. స్వయంప్రకటిత యూట్యూబర్స్ తప్పుడు వార్తలిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భక్తులు ఆక్షేపించారు. కొందరు 14 ఎముకలు దొరికాయని, మరి కొందరు 104 ఎముకలని, మరి కొందరు ఇంకొంత నెంబర్లు చెప్పి, ధర్మస్థల ఆలయ ప్రతిష్ఠ దిగజారుస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తున్నారని భక్తులు మండిపడ్డారు. అసలు ఈ నెంబర్లను ఎవరు చెబుతున్నారు? సిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు? మరి ఎవరు చెబుతున్నారు? అంటూ భక్తులు సూటిగా నిలదీశారు.

‘‘మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సిట్ ఏర్పాటును కూడా ఆహ్వానించాం. కానీ ఇప్పుడు కనీసం మరుగుదొడ్లు నడపడానికి కూడా పనికిరాని వ్యక్తులు ధర్మస్థల ధర్మాధికారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది మా నమ్మకంపై దాడి.’’ అని ఓ భక్తుడు మండిపడ్డారు.