News

కాశీ విశ్వనాథ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధం

156views

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ఆలయాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆగస్టు 11నుంచి… ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ప్లాస్టిక్ లేకుండా పవిత్రంగా ఉంచేలా భక్తులు సహకరించాలని అధికారులు కోరారు. ఈ మేరకు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన పోస్టర్లు వేశారు.

ఇకపై ప్లాస్టిక్ కు సంబంధించిన వస్తువులతో వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశం ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కనీసం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను కూడా అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఆలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు సహకరించాలని భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ భూతంపై ఇప్పటికే భక్తుల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణ కేంద్రంగా మారుతుందని అధికారులు తెలిపారు. కాలుష్యాన్ని నివారించి, భవిష్యత్ తరాలకు పర్యావరణహితమైన ఆలయాన్ని అందించేందుకే, ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు వివరించారు.