News

జమ్మూకశ్మీర్‌లో ‘ఆపరేషన్ మహదేవ్‌’ : ముగ్గురు పహల్గాం ఉగ్రవాదుల హతం

217views

జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’లో పహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించినట్లు ఆల్‌-ఇండియా రేడియో వెబ్‌సైట్‌లో వెల్లడించింది. హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. ఈ ఆపరేషన్‌ కోసం గత కొన్ని రోజులుగా దళాలు పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాచిగామ్‌ అడవుల్లో రెండ్రోజుల క్రితం అనుమానాస్పద కమ్యునికేషన్లను భద్రతా దళాలు పసిగట్టాయి. దీనికి తోడు.. స్థానిక సంచార జాతుల వారు కూడా ఉగ్రవాదుల కదలిలపై భద్రతా దళాలకు సమాచారం అందించారు.

సోమవారం చాలా బృందాలను సైన్యం ఆ ప్రదేశాలకు తరలించింది. ఉదయం 11.30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్‌, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. ముష్కర మూక షాక్‌ నుంచి కోలుకొనేలోపే శరవేగంగా ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ స్థావరంలో మొత్తం ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులున్నట్లు సమాచారం. చిక్కటి అరణ్యంలో ఓ గొయ్యి తవ్వి దానిపై టెంట్‌ వేసుకొని వీరు నక్కారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన భద్రతా దళాలకు లిడ్వాస్‌ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని చినార్‌ కోర్‌ కూడా ‘ఎక్స్‌’లో ధ్రువీకరించింది. ఇప్పటికే పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్‌ అహ్మద్‌ జోథార్‌, బషీర్‌ అహ్మద్‌లను గత నెల అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆపరేషన్‌కు ఈ పేరు ఎందుకు..?
దాచిగామ్‌ సమీంలోని మహాదేవ్‌ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు పేరు పెట్టారు. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రదేశం జబర్వన్‌-మహదేవ్‌ పర్వతాల మధ్య జరుగుతోంది. అందుకే ఈ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌ను జమ్మూకశ్మీర్‌ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా చేపట్టాయి. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. మృతిచెందిన ముగ్గురూ విదేశీ ఉగ్రవాదులే.. వీరు లష్కరే తయిబాకు చెందినవారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో కార్డన్‌సెర్చ్‌ చేపట్టారు. ఘటనాస్థలంలో ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా దళాలను నార్తర్న్‌ కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రతీక్‌ శర్మ అభినందించారు. దళాలు వేగంగా స్పందించి చర్యలు తీసుకొన్నాయని ఆయన పేర్కొన్నారు.