News

ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌

285views

ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌ (19) నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్‌ టై బ్రేకర్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు.

చివరి టైబ్రేకర్‌లో దివ్య తెల్లపావులతో బరిలోకి దిగారు. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్య నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా ఆవిర్భవించిన తొలి క్రీడాకారిణి కూడా ఆమే. ఫైనల్స్‌లో దివ్య 1.5 పాయింట్లు.. కోనేరు హంపి 0.5 సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో కోనేరు హంపీ తీవ్రమైన పోటీ ఇచ్చారు. దీంతో ఫలితం నేడు టైబ్రేకర్‌కు చేరింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో దివ్య కూడా దూకుడుగానే ఆడింది. ఓ దశలో హంపీని ఒత్తిడికి గురి చేసింది. తాజా విజయంతో దివ్య గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను అందుకొన్నారు. దీంతో భారత్‌లో ఈ హోదా అందుకొన్న 88వ వ్యక్తిగా నిలిచారు.

మహిళల ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దివ్యను విశ్వనాధన్‌ ఆనంద్‌ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు అభినందనలు దివ్య. ఉక్కంఠ భరితమైన పోరు. కోనేరు హంపీ కూడా మంచి ఆటతీరు.. పోరాటస్ఫూర్తిని కనబర్చారు. భారత చదరంగానికి సంబరాలను తెచ్చిన విజయం ఇది.

నవతరం మొదలు..
దివ్య దేశ్‌ముఖ్‌.. హంపీతో పోలిస్తే పెద్దగా అనుభవం లేని క్రీడాకారిణి. నాగపుర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య.. సీనియర్‌ విభాగంలో ఆడిన టోర్నీలు కూడా తక్కువే. ఈ టోర్నీ ఫైనల్స్‌ ముందు వరకు గ్రాండ్‌మాస్టర్‌ హోదా కూడా అందుకోలేదు. 2021లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ హోదాను పొందిన ఆమె 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఒలింపియాడ్‌లో మూడు పసిడి పతకాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. గతేడాది తొలిసారి 2500 ఎలో రేటింగ్‌ను అందుకుంది. దూకుడైన ఆటతో గ్రాండ్‌మాస్టర్లను కంగుతినిపిస్తోంది. తాజాగా ప్రపంచకప్‌లో తనకన్నా మెరుగైన రేటింగ్‌ ఉన్న ద్రోణవల్లి హారిక (క్వార్టర్‌ఫైనల్‌), జు జినర్‌ (ప్రిక్వార్టర్స్‌)పై నెగ్గడమే ఇందుకు ఉదాహరణ. సెమీస్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ జాగ్‌యిపై గెలవడం ఆమెను మరో మెట్టు ఎక్కించింది.