
దేవాలయాల్లో చోరీలు, విగ్రహాల విధ్వంసాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆలయాల రక్షణకు నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తోంది. పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఈ విషయమై దృష్టి సారించారు. జిల్లాలో ఆలయాలు ఎన్ని ఆలయాలున్నాయి.. అక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లు ఏంటి.. ఇప్పటికి సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి.. ఇంకా అవసరమైనవి ఎన్ని.. అనే అనే వివరాలతో ఇప్పటికే నివేదికలు రూపొందించారు.
నివేదికలు.. ప్రతిపాదనలు : వైయస్సార్ కడప జిల్లాలో గుట్టలు, గ్రామ శివారు ప్రాంతాల్లో ఎక్కువ ఆలయాలున్నాయి. పురాతన, ప్రాశస్త్యం కలిగిన వాటిపై దొంగల కళ్లు పడుతున్నాయి. ఆభరణాలు, హుండీల చోరీకి పాల్పడుతున్నారు. గుప్త నిధుల అపోహతో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఛేదించలేకపోతున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయడం తలకు మించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ దృష్టికి పోలీసు శాఖ తీసుకెళ్లింది. దీంతో జిల్లాలోని 289 ఉన్నాయని, మరో 5,928 చోట్ల అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల నిర్వహణ సక్రమంగా లేక అలంకారప్రాయంగా మారాయి. ఇటువంటి వాటికి మరమ్మతులు చేయించేందుకు అవసరమైన నిధుల కోసం కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు.
పర్యవేక్షణ పటిష్ఠానికే సీసీ కెమెరాలు: జిల్లాలోని చాలా ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇతర చోట్ల పర్యవేక్షణతో పాటు భద్రత దృష్ట్యా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. వీటి ఏర్పాటుతో పర్యవేక్షణ పటిష్ఠం అవుతుంది. ఈవోలు ఏదేని పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయాల్లోనూ చరవాణుల ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.-విశ్వనాథం, వైయస్సార్ కడప జిల్లా దేవాదాయ శాఖ అధికారి





