News

బెంగళూరు, కుక్కలు, ప్రజాధనం

259views

ఈ మధ్య వీధి కుక్కలు మరీ తిక్క రేగినట్టు ప్రవర్తిస్తున్నాయి. వీధి కుక్కలేం ఖర్మ, పెంపుడు జాగిలాలు సైతం యజమానుల మాట వినడం బహు అరుదే. చిన్నారుల మీద పడి వీధి కుక్కల గుంపులు కరచి చంపుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. దీనిని నివారించి తీరాలి. కుక్కల స్వైర విహారానికి సంబంధించిన వార్తలు చదువుతుంటేనే కన్నీళ్లు వస్తాయి. ఇందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కుక్కలు సైతం ఉలిక్కిపడే పథకం రూపొందించింది. అందుకయ్యే ఖర్చు అక్షరాలా రూ. 2.9 కోట్లు. పది లక్షలు తక్కువగా మూడు కోట్లు. కుక్కలు రెచ్చిపోకుండా వాటికి నిత్యం ఆహారం సరఫరా చేస్తారు. ఆ విధంగా కుక్కలని మచ్చిక చేసుకుని, వాటిని శాంతింప చేస్తారట. ఇక ప్రజలకు దానంతట అదే భద్రత ఏర్పడుతుందట. ఇంతకీ కుక్కలకి నిత్యం అందించే ఆ ఆహారం ఏమిటి? చికెన్ రైస్. కోడికూరతో విందు అనుకోవచ్చు. ఇంకా ఇతర వంటకాలు కూడా ఉన్నాయి. ఇలా చేస్తే కుక్కలు మనుషులతో స్నేహంగా ఉండడమే కాకుండా, చెప్పిన మాట విని, బుద్ధిగా మొరగడం కూడా మానేస్తాయని ఎవరు సలహా ఇచ్చారో మరి! ఏ పశువైద్య నిపుణుడి నివేదిక మేరకు జరుగుతున్నదో! ఈ పథకం దశలవారీగా అమలు చేస్తారట. మొదట 5000 కుక్కలకి ఈ పథకం అందిస్తారు.

బెంగళూరు నగరంలో మొత్తం 2.8 లక్షల కుక్కలు ఉన్నాయని అంచనా. మొత్తం ఎనిమిది జోన్లలో ఆ ఐదువేల శునకాలకి తొలి దశలో భోజనం ఏర్పాటు ఉంటుంది. నిత్యం వీటికి 367 గ్రాముల ఆహారం అందిస్తారు. 15 కిలోలు ఉండే కుక్కకి ఇది చక్కని పౌష్టికాహారం, ఒక్కొక్క భోజనం రూ. 22.42. ఇందులో 150 గ్రాముల కోడి మాంసం (ఇది ప్రోటీను లోపాన్ని నివారిస్తుంది), 100 గ్రాముల అన్నం (కార్బోహైడ్రేట్స్ కోసం), 100 గ్రాముల కూర గాయలు (మినరల్స్), 10 గ్రాముల తైలం (కొవ్వు) ఆ భోజనంలో ఉంటాయి. ప్రతి జోన్లోను 500 మంది వశు శ్రేయోభిలాషులు నగరంలోని అన్ని ప్రాంతాలలోను 25,000 కుక్కలకి ఆహారం అందిస్తున్నారు. ప్రతి జోన్లోను 400 నుంచి 500 కుక్కలను ఎంపిక చేస్తారు. 100 నుంచి 125 కేంద్రాల ద్వారా వాటికి ఆహారం అందిస్తారు. ఈ కేంద్రాల దగ్గర కుక్కలు చేసే గలీజంతా శుభ్రం చేసే పని కూడా నిర్వాహకులదే. ఇది ప్యాకేజీలో భాగమని పశు సంవర్ధక శాఖ కమిషనర్ వికాస్ కిశోర్ తెలియచేశారు. ఇలాంటి పథకం ఈ దేశంలోనే ప్రపథమం, అసాధారణం, అద్భుతం అన్నాడు మరొక కార్పొరేషన్ ఉద్యోగి. కానీ కొందరికి ఇదంతా చూసి కడుపు మండిపోతోంది. వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసి, వాటి సంఖ్య తగ్గించకుండా ఇలా ప్రజాధనంతో వాటిని మేపడం ఏమిటి అంటున్నారు. కానీ శునక ప్రేమికులు మాత్రం ఆహా ఏమి కనికరం అంటున్నారు.

తాజావార్త: గోవా ప్రభుత్వం యానిమల్ బ్రీడింగ్ అండ్ డొమిస్టికేషన్ బిల్లు (2025)ను ఆమోదించ బోతున్నది. దీని ప్రకారం క్రూరంగా ఉండే విదేశీ జాతి కుక్కలను దిగుమతి చేసుకోవడం, పెంచడం నిషేధం. అవి ఎవరినైనా కరిస్తే యజమానికి మూడు మాసాలు జైలు, రూ.50,000 జరిమానా ఉంటాయి.