News

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఆసక్తితో విదేశీ విద్యార్థులు

272views

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఆసక్తితో అనేకమంది విదేశీ విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా యోగా, వేదసంస్కృతి, భారతీయ నృత్యం, సంగీతం, దేశంలో ఉన్న వివిధ సంస్కృతులు, ప్రజల జీవనశైలి, వంటకాలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉండటంతో వారు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తైవాన్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మూడునెలలపాటు భారతదేశంలో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి వచ్చారు. ఇంపాక్ట్‌ హబ్‌ హైదరాబాదుతో మహిళా వర్సిటీకి ఉన్న అవగాహన ఒప్పందంలో భాగంగా తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీని ఈ విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. ఈనెల 18 నుంచి 21వరకు వర్సిటీలోని వివిధ విభాగాల విద్యార్థినులు, అధ్యాపకులతో సమావేశమై ప్రత్యేకతలు తెలుసుకున్నారు.

భారత్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పోటీగా నిలుస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. కళలకు ప్రాముఖ్యం ఇచ్చేవారూ ఎక్కువే. నాకు భరతనాట్యం నచ్చింది. నృత్యం ద్వారా మనలోని భావాలు ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించే విధానం గొప్పగా అనిపించింది.– చుంగ్‌ చియా హ్యువాన్, సోషియాలజీ విభాగం
భారతీయుల పూజా విధానం నచ్చింది

నేను జపాన్‌ దేశస్థురాలిని. ఉన్నత విద్య కోసం జాతీయ తైవాన్‌ వర్సిటీలో విదేశీ భాషలు, సాహిత్యంలో డిగ్రీ కోర్సు చదువుతున్నా. హైదరాబాదుకు వచ్చాక ప్రత్యేకంగా మహిళల కోసమే వర్సిటీ ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చా. భారతీయులు దేశభక్తితోపాటు వారి సంస్కృతులకు అనుగుణంగా దేవుళ్లను పూజిస్తున్నారు. ఇక్కడికొచ్చాక నాకూ దైవభక్తి పెరిగింది. పూజించడానికి వెంకటేశ్వరస్వామి పటం కొనుక్కున్నా.– యుయి అకియామా, విదేశీ భాషలు, సాహిత్య విభాగం

కళలకు పుట్టినిల్లు..
భారత్‌లోని ఆహార పదార్థాలు, మసాలా దినుసుల గురించి మా దేశంలో ఎక్కువగా మాట్లాడుకుంటారు. నేను అదే భావనతో ఇక్కడికొచ్చా. ఇండియా అంటే ఆహార పదార్థాలే కాదు భిన్న సంస్కృతులు, జాతుల మేళవింపని ఇక్కడికొచ్చాక తెలిసింది. ప్రపంచంలో వేలరకాల ఆహార పదార్థాల తయారీ ఒక్క ఇండియాలోనే ఉంది. మా దేశంతో పోల్చితే స్టార్టప్‌ల అభివృద్ధిలో ఇండియా ఎంతో వేగంగా ముందుకు వెళ్తోంది. – హువాంగ్‌ చెన్‌కై, నాటక శాఖ