
‘టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉన్నాం. గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీ వేశాం..లెక్కలు తీస్తున్నాం. టీటీడీ విజిలెన్స్ వద్ద అన్యమత ఉద్యోగుల వివరాలున్నాయి. విచారిస్తున్నారు. గతంలో అన్యమత ఉద్యోగులపై ఎలాంటి నిఘా లేదు. కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాత గట్టిగా వ్యవహరిస్తున్నాం.’ అని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తెలిపారు.‘అన్యమత ఉద్యోగులకు వీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చాం. ఇప్పటికే కొందరు ముందుకు వచ్చారు. గతంలో కొంతమందికి ఇంక్రిమెంట్లు కట్ చేశారు. అయినప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. విచారణలో తేలితే వారిని సస్పెండ్ చేస్తున్నాం’ అని తెలిపారు.
కాగా, ఆలయానికి సంబంధంలేని టీటీడీ పరిధిలోని ఆస్పత్రులు, విద్యాసంస్థల్లోకి అన్యమత ఉద్యోగులను బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సూచించిందని చైర్మన్, ఈవో తెలిపారు. ఇటీవల దేవదాయశాఖ మంత్రితోనూ ఇదే అంశంపై చర్చించామన్నారు. ఇది సున్నితమై అంశం, ప్రతి ఉద్యోగి ఇంటికి వెళ్లి తనిఖీ చేయడం సాధ్యం కాదని, అన్యమతస్తులని సమాచారం అందిన వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించి నిజమని తేలితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా అనమత్య ఉద్యోగులు ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారనే సంఖ్య లేదన్నారు. 2018లో కొంతమంది అన్యమత ఉద్యోగులను తొలగించేందుకు నోటీసులు ఇవ్వగా కోర్టు నుంచి వారు స్టే తీసుకువచ్చారని, వారిలో 20 మంది పదవీ విరమణ చేశారని తెలిపారు. మరో 22 మంది అధికారికంగా ఉన్నారన్నారు.





