News

నక్సల్స్‌ ప్రభావిత మర్కానార్‌ గ్రామానికి బస్సు

199views

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 76 ఏళ్ల తర్వాత మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి మొదటిసారిగా బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. నక్సల్స్‌కు కేంద్ర స్థానమైన గడ్చిరోలి జిల్లాలోని మర్కానార్‌ గ్రామానికి బస్సు వచ్చింది. భద్రతా బలగాల వరుస ఆపరేషన్లతో ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి తగ్గింది. చాలా గ్రామాలకు రోడ్లు, తాగు నీరు సహా రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. తాజాగా మర్కానార్‌ గ్రామాన్ని రవాణా నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చారు. గ్రామానికి బస్సు రావడంతో విద్యార్థులు సహా గ్రామంలోని 1,200 మంది ప్రయోజనం పొందనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బస్సు మర్కానార్‌ నుంచి అహోరీ వరకు సేవలు అందిస్తుంది.

మహారాష్ట్ర నక్సల్‌ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి తొలిసారిగా ప్రభుత్వ బస్సు సర్వీసు ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. మార్కనార్‌ గ్రామం గడ్చిరోలి జిల్లాలోని భమ్రాగడ్‌ ఉపవిభాగంలో నక్సల్స్‌ బలమైన కోటగా ఉన్న అబుజమాడ్‌ పర్వత ప్రాంతంలో ఉంది. గిరిజన జనాభా సాంద్రతకు, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన గడ్చిరోలి జిల్లాలో ప్రజలు చాలా కాలంగా పరిసర ప్రాంతాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం మర్కనార్‌ నుంచి ఆహేరీకి బస్సు సర్వీసును ప్రారంభించింది. గ్రామంలోకి మొదటిసారిగా అడుగిడిన ప్రభుత్వ బస్సును స్థానికులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. జాతీయ జెండాలు ఊపుతూ సంబరాలు చేసుకున్నారు. మర్కనార్, మురుంభూషి, ఫుల్నార్, కోపర్షి, పోయార్కోఠి, గుండుర్వాహి సమీప గ్రామాల్లోని విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఈ సర్వీసుతో ప్రయోజనం పొందుతారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.