ArticlesNews

రామాయణానికీ ఓ ప్రత్యేకమైన నెల…అదే రామాయణ మాసం…నేటి నుంచి కేరళలో రామాయణమాసం ప్రారంభం

195views

కేరళలో రామాయణ మాసం ఈరోజు నుండి ప్రారంభమైంది, ఈరోజునుండి నెల రోజులపాటు రామాయణాన్ని అక్కడ పారాయణం చేస్తారు. రామాయణమాసం అనేది కేరళ హిందూ క్యాలెండర్‌లో ఆధ్యాత్మికంగా ముఖ్యమైన కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. మలయాళ మాసం కర్కిడకం (జూలై మధ్య నుండి ఆగస్టు మధ్య వరకు) లో జరుపుకునే ఈ నెల పూర్తిగా రామాయణానికి అంకితం చేయబడింది. అంటే ఈ నెలలో రామాయణ గొప్పతనాన్ని అందిరకీ చెప్పేలా రామాయణ పారాయణం జరుగుతుంది. ఈ సంప్రదాయాన్ని అక్కడ అందరి ఇళ్లలో, గుళ్లలో నిర్వహిస్తారు. ఇది నెలంతా జరుగుతుంది. మనకు ధనుర్మాసం, శ్రావణమాసం ఎలా ప్రాధాన్యత కలవో ఇక్కడ రామాయణమాసానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. కేరళలో కర్కిడాన్ని కొరత నెల గా పిలుస్తారు. అంటే ఈ నెలలో వారు ఎలాంటి వ్యవసాయ పనులనీ చేయరు. కాబట్టి ఆ సమయంలో రామాయణ గ్రంథాన్ని చదవడం వల్ల ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడుతుందనీ, వారి జీవనవిధానానికి నైతిక దిక్సూచీలా మారుతుందని వారు భావిస్తారు. అందుకని ఆధ్యాత్మ రామాయణాన్ని రోజూ ఇంట్లో లేదా గుడిలో సమూహికంగా ఒక సర్గ చదువుకుంటూ నెల చివరకల్లా మొత్తం గ్రంథాన్ని పఠించడం పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా రాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్ని పండితులు వివరిస్తారు. ఇలా ఈ ఇతిహాసం పూర్తయిన తర్వాత నీలవిళక్కు (సాంప్రదాయ దీపం) వెలిగించి ప్రసాదం అందించడం ఆచారం. ఇక ఈ ఇతిహాసాన్ని చదివే ఈ నెల రోజుల పాటు మళయాలీలు ఒక పూట ఉపవాసం ఉంటారు, పాక్షిక ఉపవాసాలు పాటిస్తారు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు , మద్యమాంసాలను ముట్టరు. సాత్విక జీవనశైలిపై ప్రాధాన్యత ఇస్తారు.

రామాయణ మాసం పునరుద్ధరుణ
కాలక్రమేణా కమ్యూనిస్టు రాజకీయనాయకుల వల్ల ఈ కర్కిడం మాసంలో రామాయణాన్ని చదవడం అనేది తగ్గిపోయింది. వారు ప్రజలని చాలా ప్రభావితం చేశారు. చాలాకొద్దిమంది మాత్రమే ఈ ఆచారాన్ని పాటించేవారు. అయితే ఏప్రిల్ 1982లో ఓ విప్లవాత్మమైన మార్పుతీసుకొచ్చింది హిందూ సమ్మేళనం. కొచ్చిలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఈ రామాయణమాసాన్ని తిరిగి పునరుద్ధిరించేందకు తీర్మానం చేసింది. ఈ సమావేశంలో స్వామి చిన్మయానంద, స్వామి విశ్వేశ్వర తీర్థ, అప్పటి సంఘ సహకార్యవాహ రజ్జూభయ్యా, డాక్టర్ కరణ్ సింగ్,ఇలా సంఘ యంత్రాంగం మొత్తం కఈషి చేసింది. హిందుక్కల్ నామ్ ఒన్ననే అంటే మన హిందువులమంతా ఒక్కటే అనే నినాదంతో ఈ మాసాన్ని తిరిగి పునరుద్ధరించింది. సంఘ కార్యకర్తలు రామాయణమాసంలో రామాయణాన్ని చదివేలా ప్రోత్సహించడం నూతన ఉత్తేజాన్ని కలిగించింది. ఎంతలా అంటే క్రైస్తవ సంస్థలు కూడా తమ ప్రాంగణంలో రామాయణాన్ని పటించారు. ఇలా అక్కడ సంఘ తిరిగి రామాయణ మాసాన్ని పునరుద్ధరించింది.

రామాయణ మాసం సమయంలో తప్పక సందర్శించవలసిన మందిరాలు
కేరళలో ఆధ్యాత్మికంగా ముఖ్యమైన కర్కిడకం మాసం లో వేలాది మంది మళయాళీ భక్తులు నలంబలం దర్శనం అని పిలువబడే పవిత్ర తీర్థయాత్రకు వెళ్తారు, ఇది రామాయణంలోని నలుగురు సోదరులైన రాముడు, భరతుడు, లక్ష్మణుడు , శత్రుఘ్నులను గౌరవించే విధంగా ఏర్పాటు చేయబడిన ఓ యాత్ర. నలంబలం అనే పదానికి “నాలుగు దేవాలయాలు” అని అర్ధం, ఈ తీర్థయాత్రలో భాగంగా ఒకే రోజులో నాలుగు నిర్దిష్ట పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది,

నలంబలంలో ఉండే నాలుగు మందిరాలు
త్రిప్రయార్ శ్రీ రామ మందిర్ (త్రిస్సూర్ జిల్లా)

ఈ ప్రయాణం త్రిప్రయార్ మందిరంతో ప్రారంభమవుతుంది, ఇది నాలుగింటిలో అత్యంత ప్రముఖమైనది. భగవాన్ రాముడికి అంకితం చేయబడిన ఈ మందిరంలో దేవత ప్రత్యేకమైన చతుర్బాహురూపంలో ఉంటుంది. ఇది రాముడి స్థానంగా భావిస్తారు కాబట్టి మొదటగా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు.

కూడల్మాణిక్యం మందిర్, ఇరింజలకుడ (త్రిస్సూర్ జిల్లా)

ఇక రెండోది రాముడి తమ్ముడైన భరతునికి అంకితం చేయబడిన భారతదేశంలోని ఏకైక మందిరం ఇది. రామాయణంలో భరతుడి గొప్ప త్యాగం గురించి మనందరికీ తెలిసందే.రెండో క్షేత్రంగా దీన్ని దర్శిస్తారు.

మూజిక్కుళం లక్ష్మణ మందిర్ (ఎర్నాకులం జిల్లా)

ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ మందిరం లక్ష్మణునికి అంకితం చేయబడింది. పచ్చని పరిసరాల మధ్యలో ఎంతో ఆకర్షణీయంగా అక్కడ లక్ష్మణుడిని మందిరం ఉంటుంది.

పాయమ్మాళ్ శతృఘ్న మందిర్ (త్రిసూర్ జిల్లా)

యాత్ర చివరి దశలో భక్తులను నలుగురు సోదరులలో చిన్నవాడైన శత్రుఘ్నుడిని దర్శిస్తారు. అందుకోసం పాయమ్మల్ మందిరానికి తీసుకెళతారు. ఇలా భక్తులు నలంబల్ యాత్రను పూర్తిచేస్తారు..

కర్కిడక మాసం అమావాస్య రోజున కుటుంబంలోని దివంగత సభ్యులకు శ్రాద్ధకర్మలు ఆచరించడం కేరళీయుల ఆచారం. దానివల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వసిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంతో సరిపోలే కర్కిడక మాసం మళయాళీలకు కూడా శూన్య మాసమే. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, కొత్తపనుల ప్రారంభం వంటివి ఈ మాసంలో చేయరు. ఈ మాసం మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆయుర్వేద వైద్య చికిత్సలు. చాలామంది మళయాళీలు ఈ నెలలో కర్కిడక కంజి అనే మూలికల సమ్మిశ్రణాన్ని సేవిస్తారు.