
తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరకుండ్రం మురుగన్ ఆలయ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో రూ.2.36 కోట్లతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. పనులు ముగియడంతో 14 ఏళ్ల తర్వాత సోమవారం కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వెలుపల వళ్లి దేవస్థాన కల్యాణ మండపం, షష్టి మండపాల్లో 75 యాగశాలలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వేడుకలో పాల్గొనేందుకు మీనాక్షి అమ్మన్ ఆలయం నుంచి మీనాక్షి, సుందరేశ్వరర్ పరివార దేవతలతో బయలుదేరారు. తెల్లవారుజామున తిరుప్పరకుండ్రం చేరుకున్న మీనాక్షి, సుందరేశ్వరర్‌కి తిరుప్పరకుండ్రం 16 స్తంభాల మండపంలో స్వాగతం పలికే కార్యక్రమం జరిగింది. అనంతరం రాజగోపురం పైనున్న ఏడు కలశాలకు, అమ్మవారి సన్నిధిలో ఒక కలశం, గణపతి ఆలయంలో ఒక కలశం తదితర తొమ్మిది కలశాలను పవిత్ర జలాలతో అభిషేకించారు. ఉత్సవాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులపై పవిత్ర జలాలను డ్రోన్‌ల సాయంతో చల్లారు. మంత్రులు శేఖర్‌బాబు, మూర్తి, ఎమ్మెల్యే రాజన్ చెల్లప్ప, జిల్లా కలెక్టరు ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.





