News

చైనాలో ప్రాచుర్యం పొందుతున్న ఆయుర్వేదం

158views

కేరళకు చెందిన ఒక జంట.. చైనాలో ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పిస్తూ రాణిస్తున్నారు. ఇక్కడి వారికి భారతదేశ పురాతన వైద్య విధానాలను పరిచయం చేస్తూ క్రమంగా వారి నమ్మకాన్ని చూరగొంటున్నారు. సాధారణంగా సంప్రదాయ చైనీస్‌ వైద్య (టీసీఎం) విధానాలను అనుసరించే ఇక్కడి ప్రజలు భారత సంప్రదాయ వైద్యాన్ని నమ్మడమే కాకుండా, దీనిపై శిక్షణ కూడా తీసుకుంటున్నారని చైనాలో ఆయుర్వేద ప్రాచుర్యానికి కృషి చేస్తున్న డా.చంగంపల్లి కిజక్కిలత్‌ మొహమ్మద్‌ షఫీక్, ఆయన భార్య డా.డేన్‌ వెల్లడించారు.

షఫీక్‌ కేరళలోని 600 ఏళ్ల చరిత్ర ఉన్న చంగంపల్లి గురుక్కల్‌ అనే ఆయుర్వేద వైద్య కుటుంబానికి చెందినవారు. నిజానికి వీరంతా తుళు బ్రాహ్మణులు కాగా షఫీక్‌ కుటుంబంతో పాటు మరికొందరు ఒకానొక కాలంలో ఇస్లాంను స్వీకరించారు. అయినప్పటికీ తన వంశం మూలాలు మరచిపోకుండా ఆయుర్వేదంలో పరిశోధనలు చేసి ప్రచారం చేస్తున్నానని షఫీక్‌ తెలిపారు. ఆయన భార్య డేన్‌కూ ఆయుర్వేదంపై ఆసక్తి. ఆయుర్వేద కాలేజ్‌ ఆఫ్‌ కేరళ యూనివర్సిటీలో ఆమె చదువుతున్నప్పుడు షఫీక్‌తో పరిచయమై పెళ్లికి దారితీసింది. పుదుచ్చేరిలో వీరిద్దరూ ఆయుర్వేద కేంద్రాన్ని నిర్వహిస్తున్నప్పుడు అనేక మంది చైనీయులు వీరి దగ్గర స్వస్థత పొందారు. సంప్రదాయ వైద్యాన్ని బాగా అనుసరించే చైనాలో ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పిస్తే ఎంతో బాగుంటుందని ఆయన అప్పుడే నిర్ణయానికి వచ్చారు. అలా 2016లో తొలిసారి చైనాలో ప్రముఖ నగరమైన గ్వాంగ్‌ఝావ్‌లో అడుగుపెట్టారు.

చైనా యువతకు ఆయుర్వేదంలో శిక్షణ
షఫీక్‌ దంపతులు తొలుత యోగా, వెల్‌నెస్‌ కేంద్రాల్లో పనిచేస్తూ క్రమంగా అక్కడి చట్టాలపై అవగాహన పెంచుకున్నారు. నిబంధనలు అర్థం చేసుకున్నాక ఆయుర్వేద హోలిస్టిక్‌ థెరపీ క్లినిక్‌ను ప్రారంభించారు. చికిత్స ఒకటే కాకుండా ఆసక్తి ఉన్న చైనా యువతకు శిక్షణనూ ఇచ్చేవారు. గ్వాంగ్‌ఝావ్‌లో ఉన్న భారత ఎంబసీ, టీసీఎం ఇన్‌స్టిట్యూట్‌ల సాయంతో స్థానికుల నమ్మకాన్ని చూరగొన్నారు. తమ విద్యార్థులు కొందరు బీజింగ్, షాంఘై వంటి ప్రముఖ నగరాల్లో క్లినిక్‌లు పెట్టుకుని రాణిస్తున్నారని, ఒత్తిడి, కాలేయ సంబంధిత వైద్యంతో తమకు మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు.