ArticlesNews

ఇండోనేషియాలోని హిందూ దేవాలయాలకు మహర్దశ… అధిక సంఖ్యలో పునరుద్ధరణ కార్యక్రమాలు

256views

ఇండోనేషియాలోని హైందవ దేవాలయాలకు మహర్దశ పట్టుకుంది. ప్రాచీన హిందూ వారసత్వ పరిరక్షణలో అక్కడ గణనీయమైన పునరుజ్జీవం ప్రారంభమైంది. పవిత్రమైన బాలి ద్వీపం నుంచి జావా ప్రాంతాల వరకు, అంటే ఈ ప్రాంతమంతా హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలని, సంరక్షించాలని, కొత్త దేవాలయాలను నిర్మించాలన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఈ ప్రాంతంలో దాదాపు 12 హైందవ దేవాలయాలు వున్నాయి. వీటన్నింటినీ పునరుద్ధరించడానికి అద్భుత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.అక్కడి జావానీస్ హిందూ సమాజం ఓ అద్భుతమైన చొరవను తీసుకుంది.

అంతేకాకుండా ‘‘1000 చండిను సంతార’’ అనే మిషన్ పేరుతో ఇండోనేషియా అంతటా 1000 నూతన హిందూ దేవాలయాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హిందూ సంస్కృతిని, దేవాలయ సంస్కృతిని తిరిగి పునరుజ్జీవింపచేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సంకల్పానికి తోడు అక్కడి ప్రభుత్వం కూడా అంతే ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. దీంతో లోతైన హిందూ సాంస్కృతికి బలమైన గుర్తింపు లభిస్తోంది. హిందూ సంస్కృతి, దేవాలయ సంస్కృతి ఇండోనేషియా అంతా విస్తరించాలన్న శక్తిమంతమైన సమష్టి ప్రయత్నం ప్రారంభమైంది.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇదో మైలు రాయిగా అక్కడి వారు అభివర్ణిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ లోని 22 హిందూ దేవాలయాలు విజయవంతంగా పునరుద్ధరించబడ్డాయి. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి బాగా నష్టం సంభవించింది. కానీ ఇప్పుడు పునరుద్ధరించబడ్డాయి.

అయితే ఈ పునరుద్ధరణ పనులన్నీ యునెస్కో నిబంధనలకు లోబడే కొనసాగుతున్నాయి. ప్రామాణికత, నిర్మాణంలో సమగ్రత కోసం సంప్రదాయ ఇంటర్ లాకింగ్ రాతి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ప్రంబనన్ హిందూ దేవాలయ పునరుద్ధరణ విషయంలో ఈ పద్ధతి బాగా వినియోగంలోకి తెచ్చారు. ఈ పునరుద్ధరణ పనులకు తమ వంతు సహాయం కూడా వుంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారు.

బాలిలోని తనహ్ లాట్ దేవాలయంలో…
బాలి ప్రదేశానికే తలమానికమైన తనహ్ లాట్ దేవాలయ పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. తీరప్రాంత కోత వల్ల ఈ దేవాయలయానికి నిరంతరం ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతోంది. దీంతో వీటి నుంచి రక్షించే ఉపాయాలను అన్వేషిస్తూ ఆలయాన్ని రక్షించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందులో భాగంగా 2024 లో పునరుద్ధరణ, సంరక్షణ పనులు ప్రారంభమయ్యాయి. 2026 నాటికి పనులు పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నారు.

మువారో జంబి ఆలయ సముదాయం పునరుద్ధరణ..
సుమత్రాలోని జాంబి ప్రావిన్స్ లో ఈ విశాలమైన మువారో జంబి ఆలయం వుంది. అయితే దీని పునరుద్ధరణ పనులు కాస్త నెమ్మదిగానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఇది బౌద్ధ విద్యా కేంద్రంగా విలసిల్లింది. శ్రీవిజయ రాజ్యంలో అంతర్భాగమని నమ్ముతుంటారు. అయితే.. ఈ దేవాలయ కాంప్లెక్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. భూసేకరణ వివాదాలు, నిధుల కొరత, దేవాలయ పరిధిని నిర్ధరించే విషయాల్లో ఇబ్బందులున్నాయి. కానీ.. ఈ సవాళ్లనన్నింటినీ అధిగమించి కాస్త ముందుకు సాగుతున్నారు. మరింత అభివృద్ధి చేస్తామని, సాంస్కృతిక గుర్తింపును మరింత విస్తరించడం కోసం, పర్యాటక సామర్థ్యాన్ని పెంచడానికి యునెస్కో గుర్తింపు కావాలని కోరుతున్నారు.

బాలిలోని బెసాకిహ్ ఆలయ పునరుద్ధరణ…
2021 నుంచి ఈ ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దేవాలయం చుట్టూ వున్న మౌలిక సదుపాయాలు బాగు చేయాలని ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా దేవాలయ కేంద్రంగా కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో భక్తులకు కావల్సిన మౌలిక సదుపాయలను కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టే తమ ప్రాథమిక లక్ష్యమని, దీని తర్వాత మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు. దేవాలయం దగ్గర ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకలకు అవసరమైన సౌలభ్యం కూడా ఇప్పుడు చేస్తున్నారు. అలాగే పార్కింగ్, నీటి వసతి, వసతి గృహలను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చారు.

కేదులన్ ఆలయ పునరుద్ధరణ పనులు…
కేదులన్ ఆలయం ప్రధానంగా శివాలయం. పర్యాటక పరంగా అద్భుతమైన ప్రదేశం. ఇందులోనే మరో మూడు చిన్న దేవాలయాలు కూడా వున్నాయి. పునరుద్ధరణ ప్రాజెక్టులో ఈ దేవాలయం కూడా వుంది. 1993 లో అగ్నిపర్వత బూడిదల కింద ఈ ఆలయ ఆనవాళ్లు కనిపించాయి. సాంస్కృతిక వారసత్వ సంరక్షణ సంస్థ అనస్టిలోసిస్ పద్ధతిని ఉపయోగించి జాగ్రత్తగా పునరుద్ధరణ పనులు చేస్తోంది.

కలాసన్ దేవాలయ పునరుద్ధరణ….
ఈ కలాసన్ దేవాలయం యోగ్యకర్తలోని స్లెమాన్ రీజెన్సీలో వుంది. 8వ శతాబ్దపు ఆలయం. దీని పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది బజ్రలేప పూతతో వున్న ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం. నిర్మాణ పగుళ్లు, ఉప్పు వల్ల నష్టం, దేవాలయంలోని సముద్రపు నీరు చొచ్చుకురావడం వల్ల క్షీణ దశకు చేరుకుంది. దీంతో దేవాలయాన్ని కూల్చేసి, మళ్లీ అంతే జాగ్రత్తగా దీనిని పునర్నిర్మించారు. అక్కడి శిల్పాలను కూడా అంతే జాగ్రత్తగా సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆ తర్వాత దేవాలయాన్ని నిర్మించిన తర్వాత వాటిని సురక్షితంగా చేశారు. అలాగే పురాతన బౌద్ధ నిర్మాణ అద్భుతాలను కూడా వుంచారు.

ప్లావోసాన్ దేవాలయ పునరుద్ధరణ…
సెంట్రల్ జావాలోని క్లాటెన్ లోని ప్లావోసాన్ లో ఈ దేవాలయ సముదాయం వుంది. 9వ శతాబ్దపు హిందూ శిల్పాలకు, బౌద్ధ శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. దీని పునరుద్ధరణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే.. ఈ దేవాలయాన్ని సెంట్రల్ జావా సాంస్కృతిక వారసత్వ సంరక్షణ సారథ్యంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.అలాగే యునెస్కో ప్రదేశంగా గుర్తింపు పొందినా… పునరుద్ధరణ పనులు అంత వేగంగా సాగడం లేదు. అందులో ప్రధానమైంది నిధుల కొరత. అలాగే భూసేకరణకు ఇబ్బందులు కూడా వస్తున్నాయి. కాంప్లెక్స్ లోపల 326 దేవాలయాలుంటే.. కేవలం 23 దేవాలయాలు మాత్రమే పునరుద్ధరించబడ్డాయి.

సుకుహ్ దేవాలయ పునరుద్ధరణ పనులు
ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది. మరింత ఇబ్బందులు రాక మునుపే దీని పునరుద్ధరణ చేయాలని నిర్ణయించి, ప్రారంభించారు. సెంట్రల్ జావా కల్చరల్ హెరిటేజ్ ప్రిజర్వేషన్ సెంటర్ దీని పునరుద్ధరణకు ముందుకు వచ్చింది. ఈ దేవాలయం పిరమిడ్ ఆకారంలో వుంటుంది. భద్రతా కారణాల రీత్యా తాత్కాలికంగా ఈ దేవాలయం మూసేశారు.కానీ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయి.

బోరోబుదూర్ దేవాలయ పునరుద్ధరణ…
ఈ దేవాలయం జావాలో వుంది. దీని పునరుద్ధరణ కూడా జరిగింది. 9 వ శతాబ్దం నాటి దేవాలయమిది. శైలేంద్ర రాజవంశం దీనిని నిర్మించారు. ఇది భారీ బౌద్ధ స్మారకాలకు చిహ్నం. అయితే.. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంది. అగ్నిపర్వత బూడిద పొరల కిందికి, దట్టమైన అడవుల కిందికి వెళ్లిపోయింది. కానీ 1814 లో థామస్ స్టాంఫోర్డ్ రాఫెల్స్ దీనిని తిరిగి గుర్తించారు. ఆ తర్వాత కాస్త ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత యునెస్కో నేతృత్వంలో పునరుద్ధరణ జరిగింది. 1983 లో మరింత ప్రచారంలోకి వచ్చింది.

ఇవే కాకుండా మరిన్ని దేవాలయాల పునరుద్ధరణ కూడా జరుగుతోంది. పునరుద్ధరణ కోసం వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అక్కడి ప్రభుత్వం కూడా తగినవిధంగా సహకరిస్తోంది. భక్తులకు వుండాల్సిన మౌలిక సదుపాయాలపై కూడా అక్కడి వారు దృష్టి నిలిపారు. దేవాలయ పునరుద్ధరణతో పాటుగా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. దీని ద్వారా హిందూ సంస్కృతి మరింత విశ్వవ్యాప్తమవుతుందని, దేవాలయ వ్యవస్థ విరూడ్రూపం అందరికీ అర్థమవుతుందని స్థానిక హిందువులు అంటున్నారు.