News

విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు–2025

248views

హిందూ ఆలయాలపై జరిగిన దాడులపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌.మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఆలయాలపై దాడులు, కూల్చివేతకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో జాతీయ హిందూ ధార్మిక సదస్సు–2025 బుధవారం జరిగింది. ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి సాధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సు పాల్గొన్న మాధవ్‌ మాట్లాడుతూ.. దేవాలయాల ద్వారానే మన దేశ నిర్మాణం, సామాజిక వ్యవస్థల ప్రతిష్ట జరిగాయన్నారు. దేవాలయాలు, గోవులను సంరక్షిస్తే మన ధర్మం నిలుస్తుందన్నారు.

ఈ సదస్సులో పాల్గొన్న సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ మాట్లాడుతూ.. తిరుపతి, తిరుమల క్షేత్రాన్ని టెంపుల్‌ సిటీగా గుర్తించాలని కోరారు. తిరుమల, తిరుపతిలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని కోరారు. దేవాలయ భూములు, ఆస్తులను ఆన్‌లైన్‌ చేయాలని కోరారు. ఈ సదస్సులో విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సంఘటనా కార్యదర్శి రవి కుమార్‌, సాధుపరిషత్‌ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణ రావు, గజల్‌ శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌ నాయుడు, అడ్డూరి శ్రీ రాం, మిట్టా వంశీ తదితరులు పాల్గొన్నారు.