ArticlesNews

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

235views

ఈ యేడాది జూన్ 25 నాటికి భారతదేశం మీద ఎమర్జెన్సీ వేటు పడి 50 ఏళ్ళు గడిచింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకూ అంటే 21 నెలల పాటు దేశం మీద అత్యయిక పరిస్థితిని రుద్దారు. ఆ వ్యవధిలో భారతదేశం అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంది. చివరికి చిత్ర పరిశ్రమ సైతం విపరీతమైన సెన్సార్‌షిప్‌ను ఎదుర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకతను చూపే చిత్రాలు కొరడా దెబ్బలు తిన్నాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించే సినిమాలు, రాజకీయ ఉద్యమాలను చిత్రీకరించే సినిమాలు, అధికార పక్ష నాయకత్వాన్ని సవాల్ చేసే సినిమాలు సెన్సార్‌ కత్తెరకు బలైపోయాయి. మరికొన్ని అయితే పూర్తిగా అటక ఎక్కేసాయి.

1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకూ సుమారు రెండేళ్ళ వ్యవధిలో ఎమర్జెన్సీ పౌర హక్కులు పూర్తిగా నశించిపోయాయి. కనీసం పది సినిమాల మీద నిషేధం లేదా సెన్సార్‌షిప్‌ విధించబడింది. ఆ వివరాలు చూద్దాం.

(1) ఇందిర కథ ఉన్నందుకు ‘ఆంధీ’పై నిషేధం:
సినిమా పేరు – ఆంధీ
దర్శకుడు – గుల్జార్
నిర్మాత – జె ఓం ప్రకాష్
నటులు – సుచిత్రా సేన్, సంజీవ్‌ కుమార్
విడుదల తేదీ – 13-02-1975
నిషేధం తేదీ – జులై 1975

కారణం : దేశంలో ఎమర్జెన్సీ విధించిన కొన్ని వారాలకే అంటే జులై 1975లో ‘ఆంధీ’ చిత్రం మీద నిషేధం విధించారు. అందులో ప్రధాన పాత్ర, అంటే సుచిత్రా సేన్ పోషించిన పాత్ర ప్రధానమంత్రి ఇందిరా గాంధీని పోలి ఉంటుంది. ఆ కారణం వల్లనే నిషేధం విధించారు.

సుచిత్రా సేన్ పాత్ర ఆహార్యం, ప్రవర్తన, ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె ధూమపానం, మద్యపానం చేస్తున్నట్లు చూపించిన దృశ్యాలు ఇందిర భక్తులకు ఆగ్రహం కలిగించాయి. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా సినిమాను థియేటర్ల నుంచి తీసేసారు. కాకపోతే, ఆంధీ సినిమా అప్పటికే సుమారు 20 వారాలు ఆడింది. దాన్ని చూసిన వారు ఆ సినిమా కథ ఇందిరా గాంధీ జీవిత కథే అని భావించారు.

(2) నిషేధమే కాదు, ప్రింట్లూ తగలబెట్టేసారు:
సినిమా పేరు – కిస్సా కుర్సీ కా
దర్శకుడు – అమృత్ నహతా
నిర్మాత – అమృత్ నహతా
నటులు – మనోహర్ సింగ్, షబనా అజ్మీ
విడుదల తేదీ – సినిమా 1975 ఏప్రిల్‌లో సెన్సార్ సర్టిఫికేషన్ కోసం బోర్డుకు వెళ్ళింది. సర్టిఫికెట్ ఇవ్వలేదు. చివరికి 1977లో విడుదల అయింది.
నిషేధం – ఏప్రిల్ 1975

కారణం : ‘కిస్సా కుర్సీ కా’ చిత్రం రాజకీయ వ్యంగ్య చిత్రం. ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ఆమె కొడుకు సంజయ్ గాంధీ దాష్టీకాలను వ్యంగ్య పద్ధతిలో బైటపెట్టిందా సినిమా. అందుకే ఆ సినిమాను విడుదల కంటె ముందే నిషేధించారు. అంతే కాదు, ఆ సినిమా ప్రింట్లు అన్నింటినీ జప్తు చేసారు. వాటిని తగులబెట్టేసారు కూడా. ఎమర్జెన్సీ కాలంలో సెన్సార్‌షిప్ ఎంత దారుణంగా ఉండేది అనడానికి ఆ సినిమా ప్రింట్ల దహనమే పెద్ద ఉదాహరణ.

‘కిస్సా కుర్సీ కా’ సినిమా దేశంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోవడాన్ని, వ్యక్తి పూజ తారస్థాయికి చేరడాన్ని, అధికార దుర్వినియోగానికి అంతు లేకపోవడాన్నీ తీవ్రంగా విమర్శించింది. ఆ చిత్రంలోని పాత్రలన్నీ వాస్తవ జీవితంలో రాజకీయ నాయకులను పోలి ఉన్న పాత్రలే. ఒక పాత్ర అయితే ఇందిర కొడుకు సంజయ్ గాంధీని పోలి ఉంటుంది. సందేహాస్పదమైన ఒక కారు ప్రాజెక్టును ఆ పాత్ర సమర్ధిస్తూ ఉంటుంది. అలా ఆ సినిమాలో సంజయ్ గాంధీ మారుతీ కార్ల ప్రాజెక్టు కుంభకోణాన్ని నేరుగా ప్రస్తావించారు. ఇంక రాణిగారి ఆగ్రహానికి కొదవేముంటుంది. చిట్టచివరకు ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాతే ఆ సినిమాపై నిషేధం తొలగింది.

(3) ఆందోళన మీద నిషేధం:
సినిమా పేరు – ఆందోళన్
దర్శకుడు – లేఖ్ టాండన్
నిర్మాత – లేఖ్ టాండన్
నటులు – రాకేష్ పాండే, నీతూ సింగ్
విడుదల – జనవరి 1975
నిషేధం – జూన్ 1975

కారణం : ‘ఆందోళన్’ సినిమా కథ రాజకీయంగా చాలా సున్నితమైనది. అందువల్లే ‘ఆందోళన్’ సినిమాను నిషేధించారు. నిజానికి ఆ సినిమా కథ భారత స్వతంత్ర పోరాటంలో కీలక అధ్యాయం అయిన క్విట్ ఇండియా ఉద్యమం గురించిన ఇతివృత్తంతో కూడుకున్నది. తిరుగుబాటు, నిరోధం, ప్రజా ఆగ్రహం వంటి అంశాలు ఆ సినిమాలో చాలా ఉన్నాయి.

ఎమర్జెన్సీ సమయంలో ఆ సినిమాను విడుదల చేస్తే ప్రజల్లో చైతన్యం కలుగుతుందని, తిరుగుబాటు చేసే అవకాశం ఉందనీ ప్రభుత్వం అనుమానించింది. అందుకే ఆందోళన్ సినిమా మీద నిషేధం విధించారు. అసలు సినిమా విడుదలకే అంగీకరించలేదు. ఎమర్జెన్సీ సమయంలో సాంస్కృతిక కార్యకలాపాలను అణచివేసారు. అందులో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేసే సినిమాలు, సాహిత్యం, జర్నలిజం వంటి రంగాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు. అలా వేటు పడిన సినిమాల్లో ఆందోళన్ కూడా ఒకటి.

(4) రాజకీయ భిన్నాభిప్రాయాలపై అసహనం – ‘చండ మారుత’పై నిషేధం:
సినిమా పేరు – చండ మారుత (కన్నడ)
దర్శకుడు – తిక్కవరపు పట్టాభి రామరెడ్డి
నిర్మాత – తిక్కవరపు పట్టాభి రామరెడ్డి
నటి – స్నేహలతా రెడ్డి
విడుదల – జూన్ 1975
నిషేధం – జూన్ 1975

కారణం : ‘చండ మారుత’ సినిమా రాజకీయ ఇతివృత్తం నేపథ్యంలో తీసిన సినిమా. రాజ్య వ్యవస్థ పట్ల వ్యతిరేకత, సమాజం పట్ల విముఖతను ప్రదర్శించే విప్లవ నాటకం ఆధారంగా ఆ సినిమా తీసారు. చిత్ర దర్శకుడు తిక్కవరపు పట్టాభి రామరెడ్డి, ప్రధాన నటి స్నేహలతా రెడ్డి ఎమర్జెన్సీని ప్రత్యక్షంగానే విమర్శించారు. వారు జార్జి ఫెర్నాండెజ్ వంటి సోషలిస్టు నాయకులకు మద్దతు ప్రకటించారు. ఫలితంగా ఆ సినిమా నిషేధానికి గురయింది.

స్నేహలతా రెడ్డి సోషలిస్టు భావజాలం కలిగిన కార్యకర్త. ఆమెను మిసా చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద అరెస్టు చేసి జైలులో పెట్టారు. జైల్లో ఆమెను తీవ్రంగా హింసించారు. శారీరకంగా, మానసికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక స్నేహలత అరిచే అరుపులు జైలు గోడల్లో ప్రతిధ్వనించేవి. అదే జైలులో ఖైదీలుగా ఉన్న రాష్ట్రీయ సేవికా సమితి స్వయంసేవికలు పద్మా జోషి, గాయత్రి, సుందరేశ వంటి వారు స్నేహలత ఎదుర్కొన్న హింసకు, ఆమె ఏడ్చిన ఏడుపులకూ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. చివరికి, 1977 జనవరిలో పెరోల్ మీద విడుదలైన ఐదు రోజులకే స్నేహలత కన్నుమూసారు. అలా ఓ సోషలిస్టు ఉద్యమకారిణి, ఓ గొప్ప నటి మరణానికి ఇందిర ఎమర్జెన్సీ కారణమైంది.

(5) షోలే సెన్సారింగ్ మీద అత్యయిక ప్రభావం:
సినిమా పేరు – షోలే
దర్శకుడు – రమేష్ సిప్పీ
నిర్మాత – జి పి సిప్పీ
నటులు – ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్
విడుదల – 1975, నిషేధం తర్వాత మళ్ళీ విడుదల 15 ఆగస్టు 1975
నిషేధం తేదీ – 1975 జులైలో సెన్సార్ అయింది.

కారణం : షోలే సినిమా సెన్సారింగ్ ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. ఫలితంగా సినిమాలోని అసలైన క్లైమాక్స్ దృశ్యాలు తీసారు. దాని ప్రకారం గబ్బర్‌ సింగ్‌ను ఠాకూర్ స్వయంగా చంపేస్తాడు.

ఆ దృశ్యం సెన్సారింగ్ సమయంలో సెన్సార్ అధికారులు భయపడ్డారు. సదరు పతాక సన్నివేశం కారణంగా ప్రజల్లో వ్యవస్థకు వ్యతిరేకమైన భావనలు, తక్షణ న్యాయం గురించిన ఆలోచనలు కలుగుతాయని భావించారు. అందుకే ఆ క్లైమాక్స్‌ను మార్పించి మళ్ళీ షూట్ చేయించారు. గబ్బర్‌ సింగ్‌ను ఠాకూర్ చంపడానికి బదులు పోలీసులు అరెస్టు చేసినట్లు మార్పించారు. అలాగే సినిమాలో పలు హింసాత్మక దృశ్యాలకు కత్తెర పడింది. ఎమర్జెన్సీ కాలంలో సెన్సార్‌ ఎలా పనిచేసేది అనడానికి షోలే ఓ గొప్ప ఉదాహరణ.

(6) లోక్‌నాయక్ డాక్యుమెంటరీపై వేటు:
సినిమా పేరు – క్రాంతీ కీ తరంగే (విప్లవ తరంగాలు) (డాక్యుమెంటరీ)
దర్శకుడు – ఆనంద్ పట్వర్ధన్
నిర్మాత – ఆనంద్ పట్వర్ధన్
విడుదల 1975
నిషేధం – జూన్ 1975

కారణం : ‘క్రాంతీ కీ తరంగే’ అనే డాక్యుమెంటరీ 1974-75 కాలంలో బిహార్‌లో జయప్రకాశ్ నారాయణ తిరుగుబాటు గురించి చూపిస్తుంది. ప్రధానంగా ప్రజాస్వామ్య అనుకూలమైన ఆ ఉద్యమం అనంతర కాలంలో పాలకురాలైన ఇందిరా గాంధీని రెచ్చగొట్టి ఎమర్జెన్సీ విధించేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. చిత్ర కథాంశం రాజకీయంగా హానికరమైనదీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదీ అని భావించారు. ప్రధాన స్రవంతి మీడియా ఆంక్షల ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్న సమయంలో ఆ డాక్యుమెంటరీలో ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పెద్దసంఖ్యలో రహదారుల మీదకు వచ్చినట్లుగా చిత్రీకరించారు. ఫలితంగా ఆ డాక్యుమెంటరీ పైన కూడా అణచివేత కొనసాగింది. ఎమర్జెన్సీ సమయంలో అండర్‌గ్రౌండ్ స్క్రీనింగ్స్ ద్వారా ఆ డాక్యుమెంటరీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళారు.

(7) సత్యజిత్ రే ‘సిక్కిం’ బలి:
సినిమా పేరు – సిక్కిం (డాక్యుమెంటరీ)
దర్శకుడు – సత్యజిత్ రే
నిర్మాత – పల్దేన్ థొండుప్ నమ్‌గ్యాల్
విడుదల తేదీ – 1971
నిషేధించిన తేదీ – 1975

కారణం : ‘సిక్కిం’ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది సత్యజిత్ రే. ఆ సినిమాలో సిక్కిం ప్రాంతాన్ని సార్వభౌమ దేశంగా చూపించారు. నిజానికి 1975లో సిక్కిం భారతదేశంలో అధికారికంగా విలీనం అయిపోయింది. ఆ డాక్యుమెంటరీని ఎమర్జెన్సీ సమయంలో నిషేధించారు.

సిక్కిం స్వతంత్ర అస్తిత్వాన్ని చూపించడం మీదనే ఆ డాక్యుమెంటరీ ప్రధానంగా దృష్టి సారించింది. అలాంటి కథనం రాజకీయంగా సున్నితమైన అంశం, ప్రజలను రెచ్చగొట్టే అవకాశాలు ఎక్కువ. ప్రత్యేకించి వేర్పాటువాద భావాలకు ప్రోత్సాహం అందించే పద్ధతుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

ఎమర్జెన్సీ సమయంలో సెన్సార్‌షిప్ చాలా కఠినంగా అమలయ్యేది. అలాంటి సమయంలో రాజ్యం అధికారాన్ని సవాల్ చేయడం, సిక్కింను భారత్‌లో విలీనం చేయడంలోని చట్టబద్ధతను ప్రశ్నించడం అనే రెండు ప్రధాన కారణాల వల్ల ‘సిక్కిం’ డాక్యుమెంటరీపై నిషేధం వేటు పడింది.

(8) కిశోర్ దా పాటలపై నిషేధం:
కళాకారుడు – కిశోర్ కుమార్ (గాయకుడు, నటుడు)
నిషేధం అవధి – 1976 మే నుంచి 1977 మార్చి వరకు
కారణం : సంజయ్ గాంధీ నిర్వహిస్తున్న యూత్ కాంగ్రెస్ ర్యాలీలో ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించడమే
చర్య : కిశోర్ కుమార్ పాటలపై ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లలో నిషేధం విధించారు. ప్రభుత్వ సాంస్కృతిక వేదికలు అయిన రేడియో, దూరదర్శన్‌లలో సుమారు యేడాది కాలం పాటు ఆయన పాటలను ప్రసారమే చేయలేదు. కిశోర్ కుమార్ పాటలు అన్నింటినీ నిలిపివేయాలంటూ అప్పటి సమాచార ప్రసార శాఖ మంత్రి వి.సి శుక్లా ఆదేశాలు జారీ చేసాడు.

(9) దేవానంద్ సినిమాలపై నిషేధం:
కళాకారుడు – దేవ్ ఆనంద్
నిషేధ వ్యవధి – 1975 నుంచి 1976 జూన్ వరకూ
కారణం – ఎమర్జెన్సీకి మద్దతు ఇవ్వడానికి దేవానంద్ వ్యతిరేకించారు. ఎమర్జెన్సీని ఒక రకమైన ప్రచారం అంటూ విమర్శించారు. ప్రభుత్వ అనుకూల కార్యక్రమాల్లో, ప్రత్యేకించి సంజయ్ గాంధీకి ప్రచారం చేయవలసిన కార్యక్రమాల్లో దేవానంద్ పాల్గొనలేదు.

కార్యాచరణ – ఇందిరా గాంధీ ప్రభుత్వం దేవానంద్ మీద కక్ష తీర్చుకుంది. దేవానంద్ అన్ని సినిమాలనూ ప్రభుత్వ ప్రసారాల నుంచి నిషేధించింది. తద్వారా బాలీవుడ్‌ మహామహుల నోళ్ళు మూయించేసింది. దేవానంద్ సినిమాలను అన్ని ప్రసారాల నుంచీ తొలగించాలని దూరదర్శన్‌కు అధికారికంగానే ఆదేశాలు జారీ అయ్యాయి.

(10) ‘దస్ నంబరీ’ మీద నిషేధం:
కళాకారుడు – మనోజ్ కుమార్
నిషేధం అవధి – 1976 ఏప్రిల్ నుంచి జూన్ వరకు
కారణం – ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీకి అనుకూలంగా ఒక డాక్యుమెంటరీ తీయాలని భావించింది. అలాంటి డాక్యుమెంటరీ తీయడానికి మనోజ్ కుమార్ నిరాకరించారు.
కార్యాచరణ – అప్పట్లో దేవానంద్ నటించిన దస్ నంబరీ సినిమాను టెలివిజన్‌లో ప్రసారం చేయకుండా సమాచార ప్రసార శాఖ నిషేధం విధించింది. ఎమర్జెన్సీ సమయంలో దూరదర్శన్‌లో ఆ సినిమా ప్రసారం చేయకుండా నిలిపివేసింది.

సమాచార ప్రసార శాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా మనోజ్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసులో ఆయనే విజయం సాధించారు. సినిమా సెన్సార్‌షిప్‌ కేసులకు ఆయన న్యాయపోరాటమే దిక్సూచిగా నిలిచింది.

ఉపసంహారం:
అత్యయిక పరిస్థితి సమయంలో దేశంలోని ప్రజలందరూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. లక్షన్నర మందికి పైగా ప్రజలు జైళ్ళలో మగ్గిపోయారు. సుమారు రెండేళ్ళ పాటు నరకం చవిచూసారు. అలాంటి సమయంలో సినీ పరిశ్రమ కూడా చిక్కులు ఎదుర్కొంది. ప్రభుత్వం చెప్పిందే చేయాల్సి వచ్చింది. కానీ ఆ గడ్డు కాలంలో సైతం ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలిచిన వారూ ఉన్నారు. వారి సినిమాలపై నిషేధం వేటు పడింది. ప్రజలకు వారిని దూరం చేసే ప్రయత్నం జరిగింది. కానీ అలాంటి నిషేధాలు ఫలించలేదు. ప్రజల మనసుల్లో ఆ కళాకారుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఏమాత్రం తరిగిపోలేదు సరికదా ఇంకా పెరిగాయి.