ArticlesNews

ఎవరికీ పట్టని ఆలయ రక్షణ

252views

చోళులు, చాణుక్యుల కాలంలో 13వ శతాబ్దం లో నిర్మించిన పురాతన ఆలయ మది.. అపురూపమైన శిల్పసంపదకు ఆలవా లమది.. పంచ పాండవుల్లో ప్రథముడైన ధర్మరాజు చేతుల మీదుగా ప్రతిష్టించిన శివలింగం ఆయన పేరు మీదుగానే ఉమాధర్మలింగేశ్వర స్వామి పేరిట పూజలందుకుంటోంది..పరమ పవిత్రమైన ఐదు ధారల నుంచి లభించే పుణ్య జలాలతో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని పంచదార్లకు వచ్చే భక్తుల విశ్వాసం. ఇంతటి విశిష్టత కలిగిన పుణ్య క్షేత్రం.. దేవదాయ ధర్మాదాయ శాఖతోపాటు పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న ఆలయం నేడు కళావిహీనమై, అపరిశుభ్రతకు నిలయంగా మారింది.

అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీలోని ఓ మారుమూల గ్రామమైన ధారపాలెం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రముఖమైనది. చారిత్రక ప్రాధాన్యమున్న పంచదార్ల శివాలయంలో రాతి కట్టడాలను పరిర క్షించేందుకు ఈ క్షేత్రాన్ని పురావస్తు శాఖకు అప్పగించారు. అయితే నాటి శిల్ప సంపదను గానీ, ఆలయ పవిత్రతను గానీ కాపాడే చర్యలేవీ కానరాక ఈ ఆలయం రోజురోజుకూ కునారిల్లిపోతోంది. అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. సరైన మౌలిక సదుపాయాలు లేక భక్తుల అవస్థలు వర్ణనాతీతం. పంచదార్లలో పుణ్య స్నానం ఆచరించాక మహిళలు దుస్తులు మార్చు కునేందుకు కూడా సరైన గదుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు.మరుగుదొడ్లు లేకపోవడంతో పుణ్యక్షేత్రం పరిసరాలు మల విసర్జనలతో అపవిత్రమవుతు న్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల సమీపంలో మద్యం సీసాలు కనిపిస్తున్నాయి.

దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆలయ కట్టడాలు మాత్రం దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. ఆలయ శిల్ప కళానైపుణ్యం కనుమరుగవుతున్నా పట్టించుకునేవారు లేరు. ఆలయ స్తంభాలపై చెక్కిన శిలా శాసనాలపై తెలుపు సున్నం వేయడంతో అవన్నీ కనుమరుగు అయిపోతున్నాయి. ప్రాచీన ఆలయాల అభివృద్ధి పేరుతో శిథిలావస్థకు చేర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా గ్రావెల్‌ తవ్వకాలు జరిపి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అభివృద్ధి పేరిట తలపెట్టిన కార్యాచరణ అర్థంతరంగా ఆగిపోవడంతో గ్రావెల్‌ మట్టి ధార నీటిలో పడి ధార నీరు కలుషితమవుతోంది. ఈ పరిస్థితి భక్తులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది.

పురావస్తు శాఖ అనుమతితోనే తవ్వకాలు
ధార ప్రదేశంలో ప్రహరీ గోడ కూలిపోకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు చేపట్టామని ఆలయ కార్యనిర్వహణాధికారి తేజ తెలిపారు. పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరణ ఇచ్చారు. తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.