News

జగన్నాథుని రథయాత్రకు సర్వంసిద్ధం

241views

జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్‌, ఆలయ ఇన్‌చార్జ్‌ ఈఓ కె.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరంలోని స్థానిక సంతపేటలో ఉన్న జగన్నాథస్వామి ఆలయం ఆవరణలో ఉత్సవ కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి జూలై 5వ తేదీ వరకూ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 26న గురువారం స్వామివారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కళావాహన, బింబ దర్శనం, నేత్రోత్సవం, ప్రసాద వినియోగం పాణింగిపల్లి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. అదేరోజు సాయంత్రం జగన్నాథస్వామి శాంతి కల్యాణం, రాత్రి స్వామివారిని రథోత్సవానికి సిద్ధం చేయడం, రక్షాబంధనాలు ఉంటాయన్నారు. 27న శుక్రవారం ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నీరాజనం, 9.30 గంటలకు మేళతాళాలతో స్వామివారి రథారోహణ, రక్షాబంధనాలు, అనంతరం స్వామివారి తొలి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.

28న శనివారం నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం వరకూ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, మహిళా మండలి ఆధ్వర్యంలో విష్ణు సహస్ర నామ పారాయణం, జగన్నాథస్వామి వారి చరిత్ర పారాయణం, గోవిందనామస్మరణ ఉంటుందన్నారు. 5న మారు రథయాత్ర జూలై ఒకటో తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి తిరువీధి ఉత్సవం, స్వామివారిని దర్శించడం, శ్రీ లక్ష్మీనారాయణ సంవాదం, శీలవిరుపు ఉత్సవం నిర్వహిస్తామని తెలిపారు. జూలై 5న శనివారం మారు రథయాత్ర, అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు. జూలై 6న స్వామివారికి ప్రధాన ఆలయంలో సంప్రోక్షణ, శాంతి హోమాలు, ప్రసాద వినియోగం చేస్తామన్నారు. జూలై 10న ఆషాడ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీసత్యనారాయణస్వామివారి సామూహిక వ్రతం నిర్వహిస్తామని, భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ రమణి, ఆలయ పూజారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.