News

నారద జయంతి సందర్భంగా పాత్రికేయులకు సన్మానం

374views

నంద్యాల జిల్లాలోని సాహితీ సుధా ఫౌండేషన్ మరియు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాయి. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ, సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు.

నంద్యాల జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణా డిగ్రీ మరియు పీజీ కళాశాలల అధినేత శ్రీ రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ పాఠశాలల అధినేత శ్రీ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కర్నూల్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ శ్రీ పరుశురాముని రామకృష్ణ ప్రధాన వక్తగా ప్రసంగించారు.

.

ఈ కార్యక్రమంలో కర్నూల్ విభాగ్ సహ కార్యవాహ శ్రీ రామాంజనేయులు, శ్రీ సరస్వతి శిశుమందిర్ అనంతపురం సంభాగ్ ప్రముఖ్ శ్రీ హిమనాథ్, విభాగ్ ప్రౌఢ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్, సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి, జిల్లా సహ ప్రచార ప్రముఖ్ శ్రీ శ్రీనివాసులు, నగర ప్రచార ప్రముఖ్ శ్రీ చింతలపల్లె వాసుతో పాటు ప్రముఖ పాత్రికేయ మిత్రులు, పట్టణ ప్రముఖులు (మొత్తం 41 మంది) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మహర్షి నారదుల వారు ‘కలహ భోజనుడు’ అనే నిందను మోస్తూ కూడా ముల్లోకాలు పర్యటించి విశ్వ కళ్యాణం కోసం కృషి చేశారని తెలిపారు. అదేవిధంగా, పాత్రికేయులు కూడా సమాజంలో ఎన్నో ఒత్తిడుల మధ్య పనిచేస్తూ సమాజ హితం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. నేటి సామాజిక పరిస్థితులలో విలువలతో కూడిన సామాజిక నిర్మాణం కోసం, చీకటి మాటున జరుగుతున్న అసాంఘిక, దేశ విద్రోహ కార్యకలాపాలను వెలుగులోనికి తెచ్చి సమాజాన్ని చైతన్యపరచడమే పాత్రికేయుల ప్రధాన బాధ్యత అని ఉద్ఘాటించారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘పంచ పరివర్తన్’ పేరుతో విలువల ఆధారిత, సానుకూల సమాజ నిర్మాణం కోసం పునరంకితం అవుతున్నదని వక్తలు తెలియజేశారు.