News

సంఘ్ కార్యకర్తల ఇళ్లల్లో సోదాలు… ఎస్పీకి హైకోర్టు నోటీసులు

373views

అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలను, వారి నివాసాలను పోలీసులు లక్ష్యంగా చేసుకోవడంపై కర్నాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎలాంటి అధికారిక అభియోగాలు, వారెంట్లు లేకుండా పోలీసులు ఆపరేషన్ నిర్వహించడంపై కూడా ఆక్షేపించింది. ఈ విషయంలో దక్షిణ కన్నడ ఎస్పీ అరుణ్ కి హైకోర్టు నోటీజులు జారీ చేసింది.

ఉప్పునంగడి నివాసి, సీనియర్ సిటిజన్ అయిన రాధ ఇంటిపై ఎలాంటి కారణాలు లేకుండానే పోలీసులకు దాడులు చేశారు. దీంతో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఎస్పీకి నోటీసులిచ్చింది.ఈ నెల ఒకటో తేదీన రాత్రి పోలీసులు తన ఇంటికి సంబంధించిన ఫోటోలు తీశారని, జీపీఎస్ అప్ లోడ్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఇదంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిందని పిటిషన్ లో ఆరోపించారు. ఇదంతా తన వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొంది.దీనికి గాను తనకు 20 లక్షల నష్టపరిహారం అందించాలని కోరింది.

ఈ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీత్ దత్ యాదవ్ విచారించారు. ఏ అధికారం కింద ఈ చర్యలన్నీ తీసుకున్నారో రికార్డులు సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. చట్టపరమైన ఆదేశాల్లేకుండా తదుపరి చర్యలు వుండకూడదని తేల్చి చెప్పారు.

మరోవైపు హిందూ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య తర్వాతే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అనేక మంది సంఘ కార్యకర్తల ఇళ్లను, హిందూ నాయకుల ఇళ్లను ముందస్తు నోటీసులు, అనుమతులు లేకుండానే పోలీసులు సోదాల పేరుతో ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. రాత్రిపూట సోదాలు చేశారు. దీంతో హిందువులు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు.