
ఉత్తర కన్నడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతున్న మురుడేశ్వర్ క్షేత్రంలో భక్తులకు ఇక నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. పరమశివుని దర్శనానికి వచ్చే భక్తులు ఇక నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే రావాలని మురుడేశ్వర దేవస్థానం నిర్ణయించింది. పవిత్ర ప్రాంతాల్లో పాశ్చాత్య దుస్తులు దరించకూడదనే నిబంధనను అమలుచేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. సోమవారం ఆలయ అధికారులు జారీ చేసిన నోటీసు ప్రకారం, పురుషులు సాంప్రదాయ ధోతీ (పంచె) లేదా పూర్తి పొడవు గల ఫార్మల్ ప్యాంటు ధరించాలి, మహిళలు చీరలు లేదా సల్వార్ కమీజ్‌లలో వెళితేనే ఆలయంలో దర్శనానికి అనుమతిస్తారు. మతపరమైన ప్రదేశాలలో సాంప్రదాయ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనల గురించి సందర్శకులకు తెలియజేయడానికి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు.





