
గంగానది తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు సిద్ధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. వీటి పర్యవేక్షణకు ఇంతకు ముందే ఇద్దరు ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమించగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఆయా శాఖలకు సంబంధించి 12 మంది మంత్రులు ఉన్నారు. ఈ నియామకంతో పుష్కరాలకు తొలి అంకురార్పణ జరిగినట్లయింది. గత 2015 పుష్కరాలు తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించారు. ఈ సారి పుష్కరాల కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఆయన నేతృత్వంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు అంచెల విధానంలో పనులు..
పుష్కరాల నిర్వహణకు సబ్ కమిటీ ఏర్పాటు చేయడంతో పనుల్లో కదలిక రానుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అధికారిక హోదాలో మొదటి సారిగా పుష్కర సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం మూడు విధానాల్లో పుష్కర పనులు జరగాలని నిర్ణయించారు.
పుష్కరాల పేరుతో శాశ్వత ప్రాతిపదికన జరిగే అభివృద్ధి పనులను ముందుగా ప్రారంభించాలని నిర్ణయించి ఏడాదిన్నర ముందుగానే పనులు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. గోదావరి బండ్ విస్తరణ, ఘాట్ల సంఖ్య పెంపు, నూతన ఘాట్ల నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం సుమారు రూ. 904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండో విధానంలో రోడ్ల విస్తరణ, అనుసంధాన రహదారుల నిర్మాణం, రద్దీ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించారు. ఇందు కోసం సుమారు రూ. 300 కోట్లతో పనులు తీర్మానించారు. మూడో విధానంలో పుష్కరాల 12 రోజుల్లో ప్రజలకు అందించాల్సిన సేవలపై దృష్టి పెట్టారు. భక్తులకు తాగునీరు, వసతి సౌకర్యాలు, రవాణా సౌకర్యం ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
గత పుష్కరాలకు సుమారు 4 కోట్ల మేర భక్తులు స్నానాల కోసం రాగా, ఈ సారి రెండు రెట్లు అధికంగా వస్తారని అంచనా వేస్తున్నారు. అప్పటి పుష్కరాల్లో ఒకే రోజు ఏకంగా రికార్డు స్థాయిలో 80 లక్షల మంది భక్తులు రాజమహేంద్రవరం చేరుకొన్నారు. దీంతో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి స్తంభించింది. ఏకంగా విజయవాడ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సారి భక్తుల సంఖ్య మరింత పెరగనున్న తరుణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కమిటీ ఏర్పాటుతో ముందుగానే పనులు పర్యవేక్షించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కమిటీతో త్వరలో ఏర్పాట్లపై సమీక్ష చేపట్టేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో సన్నాహక సమావేశం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.





