News

గిరిజనుల రోగాలు తగ్గిస్తామంటూ మతమార్పిడి కుట్ర

232views

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని హైదర్‌పూర్ గ్రామంలో బలవంతపు మత మార్పిడి కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆరుగురు వ్యక్తులపై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం, 2021లోని నిబంధనలతో సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు. క్రైస్తవ ప్రార్థన ద్వారా అనారోగ్యంతో ఉన్న మహిళకు చికిత్స చేసే నెపంతో నిందితుడు హిందూ గిరిజన కుటుంబాన్ని మతం మార్చడానికి ప్రయత్నించాడని సమాచారం. విశ్వాస స్వస్థత అనే పేరుతో హైందవం నుంచి క్రైస్తవానికి మతం మారిన వారి కుటుంబానికి బదులుగా డబ్బు, గృహనిర్మాణం, విద్యను హామీ ఇచ్చి ఒక గిరిజన కుటుంబాన్ని ప్రలోభపెట్టినందుకు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

జూన్ 21న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఊరూరూ తిరుగుతూ క్రైస్తవాన్ని ప్రచారం చేసే బలిరామ్ బడోలే, హైదర్‌పూర్ నివాసి అనిల్‌ను అనారోగ్యంతో ఉన్న అతని భార్య రాధకు చికిత్స చేయడానికి తన ఇంటికి ఆహ్వానించాడు. ప్రార్థన ద్వారా రాధను నయం చేయవచ్చని బలిరామ్, అతని భార్య అనిత అనిల్‌తో చెప్పారు. ఆ తర్వాత మత మార్పిడికి ప్రయత్నించడం జరిగింది, అది త్వరగా హింసాత్మక ఘర్షణగా మారింది.

ఈ విషయంపై అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనిల్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో, “బలిరామ్, అనిత దంపతులు నా ఇంటికి వచ్చి, ‘మీ భార్య (రాధ) అనారోగ్యాన్ని ప్రార్థనతో నయం చేస్తాము’ అని అన్నారు. నేను వారిని నమ్మి రాధ, నా బంధువు రేవాసింగ్, నా స్నేహితుడు రవీంద్రతో కలిసి వారి ఇంటికి వెళ్ళాను. అక్కడికి చేరుకున్న తర్వాత, వారు ఒక మతపరమైన పుస్తకాన్ని తెరిచి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. అప్పుడు వారు, ‘మీరు క్రైస్తవ మతాన్ని అంగీకరిస్తే, మీకు ప్రతి నెలా డబ్బు లభిస్తుంది, ఇల్లు కట్టడంలో సహాయం లభిస్తుంది, మీ పిల్లలకు ఉచిత విద్య లభిస్తుంది’ అని అన్నారు.” వాళ్లు చేసే ప్రార్థనలు బూటకం అని తేలడంతో, తాను మతం మారను అనిప్రతిఘటించడంతో వారిద్దరూ కలిసి నన్ను కొట్టడానికి ప్రయత్నించారు” అని అనిల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

“వారు అమాయక గిరిజన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని నేను వారితో చెప్పాను, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించాను. అప్పుడే బలిరామ్, విలాస్, సే సింగ్, గనా, కళాబాయి నన్ను వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నించారు. వారు నన్ను తోసేశారు. రేవాసింగ్, రవీంద్ర నన్ను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, వారిని కూడా కొట్టారు. రేవాసింగ్ కంటి దగ్గర, వీపుపైన గాయమైంది” అని అనిల్ పోలీసులకు చెప్పాడు.

హిందూ సంస్థ జోక్యం, ముగ్గురి అరెస్టు…
అనిల్ దగ్గరలో ఉండేవారికి అతన్ని మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు, కొడుతున్నట్లు సమాచారం అందడంతో స్థానిక గ్రామస్తులు , హిందూ సంస్థల సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడిక్కడే ముగ్గురు నిందితులను పట్టుకోగా బలిరామ్ తప్పించుకుని పారిపోయాడు.

ఈ పరిణామాన్ని ధృవీకరిస్తూ అనిల్ ఫిర్యాదు ఆధారంగా, ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులు (బలిరాం, అనిత, కాశీరాం, విలాస్, సింగ్, కలాబాయి)పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ అభియోగాలలో ఐపీసీ సెక్షన్లు 115(2), 351(3), బిఎన్ఎస్ సెక్షన్లు 3-5, మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, 2021 లోని సంబంధిత నిబంధనలు ఉన్నాయి. నిందితులు మతమార్పిడికి బదులుగా ఆర్థిక ప్రయోజనాలను వాగ్దానం చేశారని, ఫిర్యాదుదారుడు నిరాకరించడంతో అతనిపై దాడి చేశారని ఆరోపించారు.” దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని నేపానగర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) జ్ఞానేంద్ర జైస్వాల్ అన్నారు. పారిపోయిన బలిరామ్‌తో పాటు ఇతరుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాంతంలో ఇలాంటి కేసు ఇది మొదటిది కాదు. దాదాపు ఆరు నెలల క్రితం, నవ్రా అవుట్‌పోస్ట్ పరిధిలోని కైర్పాని గ్రామంలో ఇలాంటి సంఘటన ఒకటి నమోదైంది, అక్కడ మతమార్పిడి కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 10 మంది వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
వరుసగా జరుగుతున్న సంఘటనలు గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో లక్ష్యంగా చేసుకున్న మతమార్పిడి ప్రయత్నాలు గ్రామీణుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ బలహీన కుటుంబాలను డబ్బు, గృహనిర్మాణం మరియు విద్య హామీలతో ఆకర్షిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి గ్రామీణ , గిరిజన ప్రాంతాలలో మతమార్పిడి నిరోధక చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని , ఇటువంటి కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని గ్రామస్తులతో పాటుగా హిందూ సంఘాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి.