
బీహార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షురాలు, దర్భాంగా డిప్యూటీ మేయర్ నజియా హసన్ చేసిన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో ఆమె హిందూ సంస్థల సభ్యుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంస్థల కార్యకర్తలు దర్భాంగా మున్సిపల్ కార్పొరేషన్‌ను చుట్టుముట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
తన సోషల్ మీడియా పోస్టులో నజియా హసన్ ఇలా రాశారు… “మేము మా హిందూ సోదరులను ముస్లిం సోదరుల మాదిరిగానే ప్రేమిస్తున్నాము. మేము పాకిస్తాన్‌ను కూడా ఆర్ఎస్ఎస్‌ను ద్వేషిస్తున్నట్లే ద్వేషిస్తున్నాము. ఎందుకంటే ఇద్దరూ రెండు దేశాల సిద్ధాంతానికి మద్దతుదారులు.” అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై తప్పుడు ఆరోపణలు చేసి పాకిస్తాన్‌తో పోలుస్తూ పోస్ట్ పెట్టింది. ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్ దళ్, శ్రీరామ్ సేన, ఇతర హిందూ సంస్థల సభ్యులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గుమిగూడి, డిప్యూటీ మేయర్ నజియా హసన్ కార్యాలయ పోస్ట్‌ను నిరసించారు. డిప్యుటీ మేయర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న సదర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అమిత్ కుమార్, సీనియర్ పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, సుదీర్ఘ చర్చల తర్వాత పరిస్థితిని నియంత్రించారు. నజియా అప్పటికి కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకంటూనే ఉన్నారు. తన వ్యాఖ్యలు తప్పయితే దేశద్రోహం కేసు నమోదు చేయాలని కూడా అన్నారు. దాంతో అక్కడ మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పరిపాలనా అధికారులతో సమావేశం తరువాత, నజియా హసన్ తన పోస్టు తప్పంటూ సోషల్ మీడియా ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పారు, తన పోస్ట్ పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె తన పోస్టును తొలగించారు.





