
( జూన్ 21 – జంధ్యాల పాపయ్య శాస్త్రి వర్ధంతి )
జంధ్యాల పాపయ్య శాస్త్రి పేరు తెలుగు సాహిత్యంలో ఏమాత్రం అభిరుచి ఉన్నవారికైనా తెలియనిది కాదు. మరీ ముఖ్యంగా ఆయన అసలు పేరుతోనే కాక కలం పేరు కరుణశ్రీతో కూడా ప్రసిద్ధులే. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నట్లు కరుణశ్రీ సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా అందులోని గొప్పదనానికి తరుగులేదు. పాపయ్యశాస్త్రిగారి పద్యాలు ప్రజా బాహుళ్యంలో పొందిన జనాదరణ అంతా ఇంతా కాదు. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు తన ఉదయశ్రీ కావ్య సంపుటిలో మూర్తీభవించిన కారుణ్య స్వరూపులుగా మనకు కనిపిస్తారు. భావకవితా ఉద్యమం ఉధృతంగా ప్రభంజనంగా వీస్తున్న వేళ రాసిన ఉదయశ్రీలో ఆ ఉద్యమ ధోరణుల ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేశం మీద భక్తి, ప్రణయం, ప్రేయసిని దేవతగా ఆరాధించడం, భగవంతుడి ఆరాధన, పురాతన వైభవం ప్రశంసించడం, ఒక్కోసారి పలాయనవాదం, నిరాశాపూరితమైన ధోరణి, ప్రపంచం నుంచి ఏకాంతవాసాన్ని కోరుకోవడం ఇవన్నీ భావకవిత్వ ధోరణిలో మనకు ప్రధానంగా కనిపించే అంశాలు. ఈ కవిత్వం అంతా ప్రధానంగా ఆత్మాశ్రయ కవిత్వంగా ఉంటుంది. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి ఉదయశ్రీ రచన భావకవిత్వానికి ఎత్తిన జయపతాకం. అందుకే ఆ ఛాయలన్నీ ఈ సంపుటిలో మనకు కనిపిస్తాయి.
దేశభక్తిని కలిగి ఉండడం, దేశాన్ని కన్నతల్లిగా భావించడం, తల్లి ఋణం తీర్చుకోవడం వంటి భావనలు భావకవిత్వంలో ప్రముఖంగా కనిపించే విషయాలు. అలాగే పురాతనమైన మన సంస్కృతి పట్ల అభిమానాన్ని వ్యక్తపరచడం, కీర్తించడం కూడా. ఈ ధోరణిలో తెలుగు తల్లి, స్వేచ్ఛా పుష్పాలు, మాతృశ్రీ, నవవధువు వంటి కవితలు కనిపిస్తాయి. బ్రిటిష్ సామ్రాజ్యపు ఏలుబడిలో ఉన్న భారతావనిని చెరలో ఉన్న తల్లిగా భావించి ఆ చెరవిడిపించడం కర్తవ్యంగా భావించి ఉద్బోధ చేసారు ఆనాటి కవితాకుమారులు.
జంధ్యాల పాపయ్యశాస్త్రి కలం నుంచి జాలువారిన -‘లెమ్మిక మేలుకొమ్ము! కదలింపుము క్రాంతి రథమ్ము శాంతి మార్గమ్మున, కాంతి పుంజములఖండముల్కె నవజీవన ప్రభాతమ్ములు నింప, సర్వసమతా సుమకోమల మానవాంతరంగమ్ముల ప్రేమ సూత్రమున గట్టుము మంగళతోరణమ్ములన్’ అన్న పద్యం భావయుగంలో సమతా పరిమళాల్ని వెదజల్లిన మానవతా కుసుమం. ప్రేమతో మానవతా సూత్రంతో, సర్వమానవాళిని ముడి వేయాలన్న ఆకాంక్ష ఇందులో వ్యక్తమౌతుంది. జంధ్యాల పాపయ్యశాస్త్రి ఏ గ్రంథం రాసినా అది లక్షల సంఖ్యలో అమ్ముడుపోతుంది. ఆయన రచనా పాటవం, ఆయన సృజనాత్మకత, ఆయన ప్రజాకర్షణ అటువంటివి. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ గ్రంథాలు ఎన్ని ప్రతులు ఎన్నిసార్లు ప్రచురితమయ్యాయో, ఎన్ని ప్రతులు అమ్ముడుపోయాయో లెక్కలేదు. 1912 ఆగస్టు 4న జన్మించి 1992 జూన్ 21న కాలం చేసిన పాపయ్యశాస్త్రి తన జీవిత కాలంలో 27 ప్రసిద్ధ రచనలు చేశారు. ఆయన తన ప్రతి రచనలోనూ కరుణ రసాన్ని అద్భుతంగా పండించి సార్థక కలంధేయుడయ్యారు.
కరుణశ్రీ రాసిన ప్రతి పద్యకావ్యం పాఠకుల్ని ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక చింతనకు దారి చూపిస్తుంది. అదే సమయంలో సమాజంలోని కష్టనష్టాలు, దుస్థితుల లోతుల్లోకి తీసుకువెడుతుంది. ఆ తర్వాత సామాజిక సమస్యలకు కొన్ని పరిష్కార మార్గాలను చూపిస్తుంది. శాంతి, సామరస్యం, సహజీవనం వంటి గుణాలతో జీవించడాన్ని నేర్పిస్తూనే, సామాజిక న్యాయాన్ని, మానవతా విలువల్ని రంగరించి పోస్తుంది. ఆయన రచనలను ఆసాంతం ఔపోశన పట్టినవారికి ఆయన సంప్రదాయానికి, ఆధునికతకు వారధిగా కనిపిస్తారు. సామాజిక స్పృహకు, ఆధ్యాత్మిక చింతనకు ఆయన తన రచనల ద్వారా పొంతనను సృష్టిస్తారు. ఆయనను బమ్మెర పోతనతో పోల్చిన సాహితీవేత్తలు కూడా ఉన్నారంటే అందులో అతిశయోక్తేమీ లేదు.





