
పాకిస్థానీ నిఘా సంస్థల ఏజెంట్లకు భారత సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. భారత రక్షణ రంగ గుట్టుమట్లు తెలుసుకునేందుకు పాక్ ప్రోద్బలంతో జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసులు ఆసిమ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి సోదరుడు ఖాసిమ్ కూడా పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా ఆసిమ్ విషయం వెలుగులోకి వచ్చింది.
తన సోదరుడు అప్పటికే పాకిస్థానీ ఏజెంట్ల తరపున పనిచేస్తున్నాడని ఖాసిమ్ తెలిపాడు. దీంతో, పోలీసులు ఆసిమ్‌పై కూడా దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పాటియాలా హౌట్ కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం అతడిని తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి పంపించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖాసిమ్ గతేడాది ఆగస్టులో ఒకసారి పాక్‌కు వెళ్లి వచ్చాడు. ఈ ఏడాది మార్చిలో మరోసారి పాక్‌కు వెళ్లాడు. ఈ పర్యటన సందర్భంగానే అతడు పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల టచ్‌లోకి వెళ్లాడు. కోవర్టు కార్యకలాపాల కోసం భారతీయ సిమ్ కార్డులు తీసుకురావాలని ఖాసిమ్‌ను పాక్ ఏజెంట్లు కోరినట్టు పోలీసులు తెలిపారు.
భారతీయుల నుంచి సున్నిత సమాచారాన్ని సేకరించేందుకు విదేశీయులు భారతీయ సిమ్‌లు వినియోగిస్తున్నారన్న విషయాన్ని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సిమ్ కార్డుల ద్వారా రక్షణ రంగ మౌలిక వసతులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని గుర్తించారు.





