News

పర్యాటకశాఖ కుంభకర్ణుడి నిద్ర

208views

అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చారిత్రక నగరం పెనుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో 2002లో రూ.35 లక్షల వ్యయంతో కుంభకర్ణ ప్రాజెక్టు నిర్మించారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విగ్రహం కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ప్రాజెక్టు నిర్వహణ పర్యాటకశాఖకు భారంగా మారడంతో పదేళ్ల కిందట అద్దెకిచ్చి చేతులు దులుపుకొన్నారు. అద్దెకు తీసుకున్న వారు లాభాపేక్షతో నిర్వహణ గాలికొదిలేయడంతో విగ్రహం నెర్రలు చీలి పోయింది. అనేక విగ్రహాలు శిథిలమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నా ఈ ప్రాజెక్టు వద్ద రాత్రిళ్లు మందుబాబులు హల్‌చల్‌ చేస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులు సైతం మద్యం తాగించేందుకు అనుమతించడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పర్యాటక కేంద్రం పట్ల అధికారులు చొరవ చూపాల్సి ఉంది.

20 ఏళ్లుగా రంగులు వేయించలేదు
పడుకున్న కుంభకర్ణుడి విగ్రహం, చుట్టూ నిద్ర లేపుతున్న భటుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. 20 ఏళ్లలో కనీసం రంగులు కూడా మార్చకపోవడం శోచనీయం. ప్రాజెక్టులో నిర్మించిన ట్యాంకు చుట్టూ ఆకట్టుకునే విధంగా భారీ కూజా ఆకారంలో నిర్మించారు. అది కూడా శిథిలమైంది.

పరిశీలించి చర్యలు చేపడతాం: నరసయ్య, పీడీ, డ్వామా, పర్యాటకశాఖ, జిల్లా ఇన్‌ఛార్జి
కుంభకర్ణ ప్రాజెక్టు అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరవ్వగానే పనులు ప్రారంభిస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాం.