
పాకిస్తాన్‌లో వరసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం పాకిస్తాన్‌లో బహవల్పూర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ బహల్పూర్‌లోని జైషే మహ్మద్ కార్యాలయంపై దాడి చేసింది. అయితే, అజీజ్ మరణం గురించి పాకిస్తాన్ నుంచి అధికారిక ధ్రువీకరణ రాలేదు.
జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ ఇతడి మరణాన్ని ధ్రువీకరించాయి. అంత్యక్రియలు బహవల్పూర్‌లో జరుగుతాయని ప్రకటించినప్పటికీ, దీనిపై పాక్ అధికారులు, ఉగ్రసంస్థ అగ్రనాయకుల నుంచి క్లారిటీ లేదు. ఉగ్రవాది డెడ్‌బాడీపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు సమాచారం. అయితే, జైషే వర్గాలు మాత్రం గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నాయి.
భారత్‌ని బెదిస్తూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన మౌలానా అబ్దుల్ అజీన్, కొన్ని రోజులకు మరణించడం గమనార్హం. భారతదేశాన్ని సోవియట్ యూనియన్‌లా ‘‘బాల్కనైజేషన్’’(చిన్నచిన్న ప్రాంతాలుగా విభజించడం) చేస్తానని హెచ్చరించాడు. ఈ పదం బాల్కన్ ద్వీపకల్పం విచ్చిన్నం నుంచి వచ్చింది. సాధారణంగా ఇది జాతి, మత , రాజకీయ విభాగాలతో ముడిపడి ఉంటుంది.





