
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు అనుసంధానం ఇన్నాళ్లకు వాస్తవ రూపం దాల్చిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు కాశ్మీర్ ప్రజల కల నెరవేరిందని.. ఇది ఐక్యత, సంకల్పానికి చిహ్నంగా మోడీ అభివర్ణించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల ప్రశంసలు కురిపించారు, ఇది భారతదేశ మౌలిక సదుపాయాల ప్రయాణంలో ఒక మైలురాయిగా కొనియాడారు. అంతేకాకుండా జాతీయ ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించారు. నేటి కార్యక్రమం భారతదేశ ఐక్యత మరియు సంకల్ప శక్తికి ఒక గొప్ప వేడుక అని మోడీ ప్రకటించారు. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ ఇప్పుడు భారతదేశపు విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించబడిందన్నారు.
ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా 2022లో పూర్తైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు.
చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూకశ్మీర్ పురోగతికి ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. కశ్మీర్‌లో అభివృద్ధిని ఆపలేరన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి కశ్మీర్ లోయలో పర్యటించిన ప్రధాని.. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా నిలిచిన చినాబ్ వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునరుద్ఘాటించారు.
‘‘మన పొరుగు దేశం పర్యాటకానికి, మానవత్వానికి వ్యతిరేకం. మన పర్యాటకాన్ని దెబ్బతీసి పేదల పొట్టగొట్టాలని చూస్తోంది. ఆదిల్ హుస్సేన్ గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీవాలా. తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడే అతడు.. ఆ రోజు ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడు. అతడినీ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. పాక్ కుయుక్తులను భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. ఉగ్ర కుట్రలకు దీటుగా బదులిస్తున్నాం. కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమాయక ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో మన శక్తి ఏంటో చూపించాం. సరిగ్గా నెల రోజుల క్రితం పొరుగు దేశంలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం. పాక్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశాం. ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరు’’ అని మోదీ పునరుద్ఘాటించారు.





