
అమెరికాలోని కొలరాడోలో కలకలం చెలరేగింది. ఇక్కడి బౌల్డర్‌లో చోటుచేసుకున్న దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
ఎప్‌బీఐ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ విలియమ్సన్ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నిందితుడు యూదులపై బాంబులు విసురుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని అరిచాడని తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వీజర్ మాట్లాడుతూ ఈ ఘటనలో కొందరిని లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తున్నదన్నారు. కాగా నిందితుడిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాగా ఎప్‌బీఐ గుర్తించింది.
ఈ ఘటనపై బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫెర్న్ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ బందీలను గుర్తుచేసుకుంటూ ప్రదర్శన జరుగుతుండగా, దానికి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో అమెరికాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ మద్దతుదారులు.. ఈ పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేక నిరసనలుగా పేర్కొంటున్నారు.





