
ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు భారత అఖిలపక్ష బృందాలు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా భాజపా నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం లండన్‌లో పర్యటించింది. ఈసందర్భంగా బృందంలో సభ్యురాలైన శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది పాక్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధి బాటలో సాగుతున్న భారత్ జీ-20 సదస్సుకు ఆతిథ్యమిస్తే పొరుగుదేశం పాకిస్థాన్ మాత్రం టీ 20కి అంటే.. టాప్ 20 ఉగ్రవాదులకు ఆతిథ్యమిస్తోందని ఎద్దేవా చేశారు.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడుల వెనక ఉన్న అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు కూడా పాక్ ఆశ్రయం ఇచ్చిందని ప్రియాంక పేర్కొన్నారు. అతడికి పాకిస్థాన్ ఏవిధంగా ఆశ్రయం కల్పించింది, నిధులు సమకూర్చడం, ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం, ఉగ్రచర్యలను ప్రోత్సహించడం వంటి విషయాల గురించి ఓ డాక్యుమెంటరీ కూడా ఉందని.. దానిని అందరూ తప్పక చూడాలని వారికి తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్నోఏళ్లుగా భారత్ పోరాడుతోందని ప్రియాంక అన్నారు. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ విశ్వసిస్తోందని పేర్కొన్నారు. అక్కడి వారికి పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామాల గురించి వివరించారు.





