News

హరియాణా శివాలయంలో లేఖ కలకలం

268views

హరియాణాలోని హిసార్‌ పట్టణ రెడ్‌స్క్వేర్‌ మార్కెటు వద్ద గల శివాలయంలో దొరికిన ఓ లేఖ కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు వందమందిని కిడ్నాప్‌ చేసి పాకిస్థాన్, దుబాయ్‌లకు అక్రమ రవాణా చేసినట్లు ఆ లేఖలో ఉంది. ఆలయ పూజారి సురేశ్‌కు ఈ లేఖ శనివారం దొరికింది. లేఖపై తెలంగాణాలోని నిజామాబాద్‌కు చెందిన ఆలకుంట సంపత్‌ చిరునామా ఉంది. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. హిసార్, అంబాలా, గురుగ్రామ్, సిర్సా, రేవాడీ, గంగానగర్, అజ్‌మేర్, నర్వానా తదితర నగరాల నుంచి కిడ్నాపులు జరిగినట్లు లేఖలో ఉంది. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ‘‘నా పేరు చెప్పను. మేము 2018 నుంచి ఈ అక్రమ రవాణా చేస్తున్నాం. ఫతేహాబాద్‌కు చెందిన ఒక కుటుంబం మాకు సహాయం చేసింది. ఇలా అక్రమ రవాణా చేసినవారిలో ఒకరు పాకిస్థాన్‌ నుంచి తప్పించుకొని పారిపోయారు. ముఠాకు చెందిన మహిళా నాయకురాలు ఆ యువకుడిని పట్టుకొని చంపమని లేదా అతని కుటుంబం నుంచి మరో వ్యక్తిని కిడ్నాప్‌ చేయమని బెదిరిస్తోంది. ఆమె నన్ను కూడా బెదిరించిన కారణంగా భయంతో ఈ లేఖ రాస్తున్నా’’ అని అనామక వ్యక్తి అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, లేఖ కవరుపై పేరు ఉన్న వ్యక్తిని గుర్తించడానికి ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరుగుతోందని హిసార్‌ ఎస్పీ శశాంక్‌కుమార్‌ సావన్‌ తెలిపారు. పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.