News

భారతీయ సంస్కృతి పై చర్చ

345views

ఇండియాలో బస్సులోనూ, రైల్లోనూ ప్రయాణించేటప్పుడు టిఫిన్ బాక్సులు తెరిచి భోజనం చేయడం ఒక సహజమైన సాధారణ దృశ్యం. ఇడ్లీ, పులిహోర, చిప్స్ లాంటి స్నాక్స్‌ని ఇతర ప్రయాణికులతో పంచుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఇది కేవలం ఆకలికి మాత్రమే కాదు.. సంస్కృతికి, స్నేహానికి చిహ్నంగా భావిస్తారు. కానీ, ఇతర దేశాల్లో, ముఖ్యంగా పశ్చిమ దేశాలలో ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇలా భోజనం చేయడం అసాధారణ ప్రవర్తనగా వ్యవహిస్తారు. హైజీన్, ఇతరుల ఆత్మీయతకు గౌరవం వంటి అంశాల దృష్ట్యా అక్కడ అలాంటి ప్రవర్తనపై విమర్శలు వస్తుంటాయి. తాజాగా లండన్‌లోని మెట్రో రైలులో ఓ భారతీయ మహిళ చేతులతో భోజనం చేస్తూ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

వైరల్ అవుతోన్న వీడియోలో రద్దీగా ఉండే మెట్రో రైలులో ఓ మహిళ సీటులో కూర్చుని ఉంది. ఆమె ఒడిలో ప్లేటు పెట్టుకుని కుడి చేతితో అన్నం తింటూ, ఎడమ చేతితో ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ కనిపిస్తోంది. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. అలాగే, ఈ వీడియో కేవలం ఒక మహిళ భోజనం చేసిన దృశ్యం మాత్రమే కాదు.. భారతీయ సంస్కృతిని, అంతర్జాతీయ వేదికపై మన ప్రవర్తనకు ప్రతిబింబాన్ని చూపే సందర్భంగా మారింది. దీంతో, ప్రజా ప్రదేశాల్లో ప్రవర్తన ఎలా ఉండాలి? వ్యక్తిగత స్వేచ్ఛకు, ఇతరుల హక్కులకు మధ్య సరిహద్దులు ఏవి? అనే చర్చ మొదలైంది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఇలాంటివి అశుభ్రతకు కారణం అవుతాయి’, అంటూ కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ‘చేతులతో భోజనం చేయడం అనేది భారతీయ సంస్కృతిలో సాధారణమైన పద్ధతి’ అని, ‘బర్గర్, శాండ్‌విచ్‌లు తినవచ్చు కానీ అన్నం తినడమే తప్పా?’ అంటూ ఆమెకు మద్ధతుగా ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఇతరులు, వ్యక్తిగత స్వేచ్ఛ, సంస్కృతుల గౌరవం ముఖ్యం అని, ఈ మహిళ ఎవరికీ నష్టం చేయలేదని పేర్కొంటున్నారు.

అలాగే ఈ సంఘటన ఒక సాధారణ వీడియో కంటే ఎక్కువగా.. మన సంస్కృతి ఎంత విస్తృతమైనదో, అంతర్జాతీయ వేదికలపై మన ప్రవర్తనకు ఉన్న ప్రాధాన్యత ఏంటో గుర్తుచేసే సంఘటనగా నిలిచింది.