News

పాక్‌లో 90 రోజులున్నా.. ఐఎస్‌ఐ అధికారుల్ని కలిశా!

245views

పాకిస్తాన్‌కు రెండుసార్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌ నిఘా సిబ్బందికి (పీఐవోలకు) భారత మొబైల్‌ సిమ్‌ కార్డులను అందజేయడంతోపాటు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇతడిపై ఆరోపణలున్నాయి. రాజస్తాన్‌ రాష్ట్రం దీగ్‌ జిల్లా గంగోరా గ్రామానికి చెందిన కాసిమ్‌(34)ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇతడు 2024 ఆగస్ట్‌– 2025 మార్చి మధ్యలో రెండుసార్లు పాకిస్తాన్‌ వెళ్లి వచ్చాడని, అక్కడ కనీసం 90 రోజులు గడిపినట్లు విచారణలో వెల్లడించాడని చెప్పారు. ఆ సమయంలో అతడు పాక్‌ గూఢచర్య విభాగం ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)అధికారులను కలిసినట్లు చెబుతున్నారు.

భారత మొబైల్‌ నంబర్లను పాక్‌ నిఘా విభాగం అధికారులు గూఢచర్యం కోసం వాడుతున్నట్లు 2024 సెప్టెంబర్‌లో తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని ఇక్కడే పొంది, అక్కడికి పంపించారని తెలిపారు. ఈ నంబర్లను వాడుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ మార్గాల్లో భారతీయులను వలలో వేసుకుని, ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించామని వివరించారు. వీటిపై దర్యాప్తు సమయంలోనే కాసిమ్‌ పేరు బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో అధికారులు దేశంలో గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై పలువురిని అదుపులోకి తీసుకుంటుండటం తెల్సిందే.