
లోక్‌మాతా దేవి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన లోక్‌మాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భోపాల్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లోక్‌మాతా దేవి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి నేడు 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమైన సందర్భం మరియు జాతి నిర్మాణ గొప్ప ప్రయత్నానికి దోహదపడే క్షణం అని చెప్పారు. దేవి అహిల్యాబాయిని ఉటంకిస్తూ, నిజమైన పాలన అంటే ప్రజలకు సేవ చేయడం మరియు వారి జీవితాలను మెరుగుపరచడం అని ఆయన పునరుద్ఘాటించారు. నేటి కార్యక్రమం ఆమె దార్శనికతకు ప్రతీక అని ఆమె ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతుందని ఆయన అన్నారు.
లోకమాతా దేవి అహిల్యాబాయి హోల్కర్ పేరు వినగానే ఆమె అసాధారణ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని మోదీ అన్నారు. దేవి అహిల్యాబాయి దృఢ సంకల్పం పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పరివర్తనాత్మక ఫలితాలను సాధించవచ్చని చూపిస్తుందని చెప్పారు. మూడు శతాబ్దాల క్రితం, దేశం అణచివేత గొలుసుల్లో బంధించబడినప్పుడు, అసాధారణమైన విజయాలను సాధించడం – నేటికీ తరాలు వాటి గురించి మాట్లాడుకునేంతగా చేయడం అంత తేలికైన పని కాదని కొనియాడారు.
లోకమాతా అహిల్యాబాయి హోల్కర్ దేవుడికి సేవ చేయడం మరియు ప్రజలకు సేవ చేయడం మధ్య ఎప్పుడూ తేడా చూపలేదని తెలిపారు. ఆమె ఎల్లప్పుడూ తనతో పాటు శివలింగాన్ని తీసుకెళ్లేదని, ఇది ఆమె లోతైన భక్తికి చిహ్నం అని అన్నారు. ఆమె తన పరిపాలనా కాలంలోని సవాళ్లను గుర్తుచేసుకుంటూ, అటువంటి కాలంలో రాజ్యాన్ని నడిపించడం కత్తిమీద సాము అని అన్నారు. అయినప్పటికీ, లోకమాత అహిల్యాబాయి తన దేశ శ్రేయస్సుకు కొత్త దిశానిర్దేశం చేశారు, పేదలలో పేదవారికి సాధికారత కల్పించడానికి తనను తాను అంకితం చేసుకున్నారని తెలిపారు. “లోకమాత అహల్యాబాయి భారతదేశ వారసత్వానికి గొప్ప సంరక్షకురాలు” అని అన్నారు, దేశ సంస్కృతి, దేవాలయాలు మరియు తీర్థయాత్రలు దాడికి గురైన సమయంలో, వాటిని పరిరక్షించే బాధ్యతను ఆమె స్వీకరించారని ప్రధాని పేర్కొన్నారు.
కాశీ విశ్వనాథ ఆలయంతో సహా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల పునరుద్ధరణకు ఆమె చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు. లోకమాత అహిల్యాబాయి విస్తృతమైన అభివృద్ధి పనులు చేపట్టిన వారణాసి నగరంలోనే సేవ చేసే అవకాశం లభించడం తనకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. “మాత అహిల్యాబాయి పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ఆదర్శప్రాయమైన పాలనా నమూనాను అమలు చేశారని పేర్కొన్నారు. ఉపాధి మరియు వ్యవస్థాపకతను పెంచడానికి ఆమె అనేక కార్యక్రమాలను ప్రారంభించారని అటవీ ఉత్పత్తుల ఆధారంగా వ్యవసాయం, కుటీర పరిశ్రమలు మరియు చేతిపనులను ఆమె ప్రోత్సహించారని, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఆమె చిన్న కాలువలను అభివృద్ధి చేసి మరియు సుమారు 250-300 సంవత్సరాల క్రితం అనేక చెరువులను నిర్మించడం ద్వారా విస్తృతమైన నీటి సంరక్షణ ప్రయత్నాలను చేశారని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆమె పత్తి మరియు సుగంధ ద్రవ్యాల సాగును ప్రోత్సహించారని చెప్పారు,
ప్రపంచ ప్రఖ్యాత మహేశ్వరి చీరల కోసం కొత్త పరిశ్రమలను స్థాపించడం ద్వారా వస్త్ర రంగంలో దేవి అహిల్యాబాయి చేసిన సహకారాన్ని ప్రధాని స్మరించుకున్నారు. దేశంలోని నేత కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని దేవి అహల్యాబాయి సుమారు 250-300 సంవత్సరాల క్రితం గుజరాత్‌లోని జునాగఢ్ నుండి కొన్ని చీర నేత కుటుంబాలను కూడా ఇదే పని చేయమని ఆహ్వానించారని తెలిపారు. “దేవి అహిల్యాబాయి హోల్కర్ ఆమె ముఖ్యమైన సామాజిక సంస్కరణలకు, బాలికల కనీస వివాహ వయస్సును పెంచడం, మహిళల ఆస్తి హక్కులను పొందడం మరియు వితంతువుల పునర్వివాహానికి మద్దతు ఇవ్వడం వంటి నిర్ణయాలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు” మోదీ అన్నారు.
సామాజిక సవాళ్లు ఉన్నప్పటికీ రాణి అహిల్యాబాయి ప్రగతిశీల సంస్కరణలకు గట్టిగా మద్దతు ఇచ్చారని చెప్పారు. ఆమె మాల్వా సైన్యంలో ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని మరియు గ్రామాల్లో మహిళా భద్రతా సమూహాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ చర్యలు మహిళా భద్రత మరియు సాధికారతను నిర్ధారిస్తుందని పేర్కొన్నారు.
చివరిగా ప్రధానమంత్రి ఆమెకు నివాళులు అర్పిస్తూ, “మాత అహిల్యాబాయి దేశ నిర్మాణంలో మహిళల అమూల్యమైన సహకారానికి చిహ్నం” అని అన్నారు, ఆమె అందరిపై నిరంతర ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థిస్తున్నాని తెలిపారు.





