News

సనాతనమే భారతీయ పునాది… ముస్లింలు రాముడి వారసులు : సిద్దిఖీ

288views

సనాతన ధర్మమే భారత దేశానికి పునాది అని, భారతీయ ముస్లింలందరూ రాముడి వారసులని బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమల్ సిద్దిఖీ అన్నారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ముస్లింల గుర్తింపు అనేది ఇక్కడి నాగరికతతో లోతుగా ముడిపడి వుందని అన్నారు. తమ గుర్తింపు ఇప్పటికీ సనాతనమైనదేనని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన ఇస్లామిక్ గ్రంథం, హదీసులను ప్రస్తావిస్తూ.. ఖురాన్ 25 మంది ప్రవక్తల గురించి ప్రస్తావిస్తుంది, కానీ హదీసులు మరియు సంప్రదాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1,24,000 మంది ప్రవక్తలను పంపారని తెలిపారు.

రాముడు, కృష్ణుడు అస్తిత్వాలపై కూడా సిద్దిఖీ మాట్లాడారు. అసలు వారిద్దరూ లేనేలేరని ఎలా చెప్పగలం? అని ప్రశ్నించారు. సనాతన ధర్మంలోని ఈ అవతారాలను ఇస్లామిక్ సంప్రదాయంలో దైవ దూతలుగా చూడవచ్చని అన్నారు.రాముడు, కృష్ణుడ్ని నమ్మని ముస్లింలను అసలు ముస్లింలనే పిలవలేమని తేల్చి చెప్పారు. భారత దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని తిరస్కరించడం అంటే దైవిక సూత్రాల నుంచి విడిపోవడమే అవుతుందని అన్నారు.

భారతీయ ముస్లింలు విదేశీయులు కారని, హిందూ సోదరుల లాగే వారు కూడా పవిత్ర భూమికి, చరిత్రకి వారసులు అని అన్నారు. ఆరాధన విధానాలు వేర్వేరుగా వున్నా.. అంతర్లీనంగా వున్న సంస్కృతి మాత్రం అలాగే స్థిరంగానే వుందని సిద్దిఖీ అన్నారు.