ArticlesNews

సంఘ సంస్కరణా ప్రభాత గీతం కందుకూరి వీరేశలింగం

162views

( మే 27 – కందుకూరి వీరేశలింగం పంతులు వర్థంతి )

తెలుగు సమాజానికి, సాహిత్యానికి వేగుచుక్క కందుకూరి వీరేశలింగం పంతులు. భవిష్యత్ సమాజాన్ని ఊహించిన క్రాంతదర్శి. సంఘసంస్కరణకు గొప్ప కృషి చేసిన మార్గదర్శి. తెలుగు సాహిత్యంలో అనేక ఆధునిక ప్రక్రియలకు ఆద్యుడు. మాటల్తో కాదు, చేతల్తో సైతం కార్యరంగంలోకి దిగి అనేక సంఘసంస్కరణ కార్యక్రమాలు స్వయంగా చేపట్టిన ఘనుడు. అందుకే ఆధునిక సాహిత్యంలో ఆయన స్థానం విశిష్టమైంది. తెలుగులో ఆధునిక యుగ ఆరంభానికి వీరు సుప్రభాత గీతాన్ని ఆలపించారని నిస్సందేహంగా చెప్పొచ్చు.

కందుకూరి వారి కుటుంబం సంప్రదాయాలకు నిలయం. అలాంటి కుటుంబంలో ఏప్రిల్ 16, 1848న జన్మించారు వీరేశలింగం పంతులు. తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. వీధిబడిలో చదువుకున్న వీరేశలింగం సర్వకళాశాల పరీక్ష పాసై 1871లో రాజమహేంద్రవరంలో దొరవారి మండల పాఠశాలలో ఉపాధ్యాయవృత్తిలో చేరారు. ఆ తర్వాత కోరంగిలో ఆంగ్ల పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా కూడా పనిచేశారు. 1876లో రాజమహేంద్రవరంలోని రాజకీయ పాఠశాలలో ఆంధ్ర ద్వితీయోధ్యాయ పదవిలో నియమింపబడ్డారు. 1861లో రామలక్ష్మమ్మతో వీరికి వివాహం జరిగింది. కేశవ చంద్రసేన్, ఆత్మూరి లక్ష్మీనృసింహం వంటి వారి బోధనలలతో ప్రభావితం అయ్యారు. నేరుగా సంఘసంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు. ఆ కార్యాల ప్రచారానికి, ప్రజలలో చైతన్యం తేవడానికి రచనా మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. 1879లో ప్రార్థనా సమాజాన్ని నెలకొల్పారు. 1881లో వితంతు వివాహం చేశారు. 1897-98లో మద్రాసులో వితంతు శరణాలయం స్థాపించారు. 1905లో హితకారిణీ సమాజాన్ని నెలకొల్పారు. బాలికా పాఠశాల స్థాపించారు. స్త్రీ విద్యకు, బాల్యవివాహాల నిషేధానికి, వితంతువివాహాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా… పంతులుగారు విశేషమైన కృషి చేశారు.

సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి.ఆయన 130కి పైగా గ్రంధాలు రాసాడు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంధాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు వాచకాలు రాసాడు. స్వీయ చరిత్ర రాసాడు. ఆంధ్ర కవుల చరిత్రను కూడా ప్రచురించాడు. నీతిచంద్రికలోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసారు.

వీరేశలింగం గారికి పేరుప్రఖ్యాతులు తెచ్చినవి ప్రహసనాలు. వ్యంగ్యంతో సమాజంలోని అంధవిశ్వాసాలు, స్వార్థం, ప్రజల అమాయకత్వాన్ని విమర్శకు పెట్టారు. ప్రధానంగా సంఘసంస్కరణ ప్రభోదించారు. వివేకవర్థిని సతీహితబోధిని, చింతామణి, సత్యసంవర్థిని, సత్యవాది పత్రికలలో వీరి వ్యాసాలు విరివిగా ప్రచురింపబడేవి. తర్వాత ఇవి సంపుటాలుగా వచ్చాయి. రాజకీయ, నైతిక, ఆర్థిక, మత, విద్య, స్త్రీ సంబంధమైన అంశాలతో పంతులుగారు వ్యాసాలు రాశారు.

వీరేశలింగం పంతులుగారి రచనలు ఆనాటి సమాజంలోని చెడును వివరిస్తాయి. మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయి. గ్రాంథికంలో కాకుండా సరళ గ్రాంథికంలో ఉండి అందరికీ అర్థమవుతాయి. ముఖ్యంగా సంఘసంస్కరణ దృష్టితో స్త్రీల అభివృద్దే ధ్యేయంగా వీరి రచనలు సాగాయని చెప్పాలి. జీవితాన్ని పరులకోసం వెచ్చించిన వీరేశలింగం గారి గురించి చిలకమర్తి వారు-
తన దేహము తన గేహము
తన కాలము తన ధనము తన విద్య జగ
జ్జనులకు వినియోగించిన
ఘనుడీ విరేశలింగ కవి జనులారా…. అన్నారు.
ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించి, తెలుగుజాతికే గర్వకారణమైన వీరేశలింగం పంతులుగారు 1919 మే27న తన 71 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. జీవితాంతం సమాజ సేవకే అంకితమైన వారి ఆశయసాధన మనమంతా కృషి చేద్దాం. అదే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.